మెదక్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ‘ఎంతో మంది హామీలు ఇచ్చారు గానీ, ఎవరూ నెరవేర్చలేదు. ప్రధానమంత్రిగా, మెదక్ ఎంపీగా ఉండి కూడా ఇందిరాగాంధీ మెదక్ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ మాట తప్పినా.. మెదక్ జిల్లా ప్రజల కలలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. శనివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 23న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్, పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వస్తున్నారన్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. మెదక్ జిల్లా ఏర్పాటు ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అని, మెదక్‌కు రైలు తీసుకురావడం ఎన్నో ఏండ్ల కల అని మంత్రి గుర్తు చేశారు. కాంగ్రెస్ ఉంటే కలలు కలలుగానే ఉంటాయని, కలలు కనడం సాకారం చేసే సత్తా ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో కలెక్టరేట్ల పరిస్థితి దారుణంగా ఉండేదని, తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ 33 జిల్లాలు ఏర్పాటు చేసి జిల్లాకో కలెక్టరేట్‌ను అద్భుతంగా నిర్మించారన్నారు. మా రాష్ట్రంలోని సచివాలయాల కంటే మీ కలెక్టరేట్లు బాగున్నాయని ఇతర రాష్ర్టాల నాయకులు చెబుతున్నారన్నారు.
జిల్లాలు ఏర్పాటు చేయడంతో జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు ఏర్పడ్డాయని, దీంతో ప్రజలకు సేవలు మరింత చేరువయ్యాయన్నారు. కార్యాలయాలన్నీ ఒకే దగ్గర ఉండడంతో వేగంగా సేవలు అందుతాయని తెలిపారు. ఇక్కడి పథకాలు చూసి ఇతర రాష్ర్టాలకు చెందిన నాయకులు ఆశ్చర్యపోతున్నారన్నారు. ఇది కలనా నిజమా అన్న రీతిలో పనులు జరుగుతున్నాయన్నారు.
వచ్చే నెలలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన
మెదక్ మెడికల్ కాలేజీ కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని, వచ్చే నెలలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి శంకుస్థాపన చేయబోతున్నామని మంత్రి తెలిపారు. మెదక్ జిల్లాను సాకారం చేసి, కలెక్టరేట్ ఏర్పాటు చేసి, మెడికల్ కాలేజీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్ ఇక్కడికి రావడం సంతోషకరమన్నారు.
సీఎం సభకు లక్షలాదిగా తరలిరావాలి
ఈ నెల 23న సీఎం కేసీఆర్ మెదక్ పర్యటనలో భాగంగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సందర్భంగా మెదక్ జిల్లా నుంచి లక్షలాదిగా యువత, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. పట్టణంలోని సీఎస్ఐ చర్చి కాంపౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ నిర్వహిస్తామన్నారు. జిల్లా ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపే సందర్భం ఇది అని అన్నారు. ఈ కార్యక్రమం ఒక పండుగలా విజయవంతం చేయాలని కోరారు.
ఇందిరాగాంధీ మెదక్ ఎంపీగా గెలిచి, ప్రధానమంత్రి అయ్యారు. ఎంపీ ఎన్నికలప్పుడు మెదక్‌కు జిల్లా కేంద్రంగా చేస్తానని హామీ ఇచ్చారు. మెదక్‌కు రైల్వే లైన్ కూడా మంజూరు చేస్తానని చెప్పి, చేసిన దాఖలాలు లేవు. సీఎం కేసీఆర్ మాట మీద నిలబడి మెదక్ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు నిర్మించారు. ఇప్పుడు వీటిని ప్రారంభించుకోవడం సంతోషించదగ్గ విష యం. దీంతో మెదక్ రూపురేఖలు మారిపోయాయి. – ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు
బడుగుల కోసమే తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసమే చేస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. మైనార్టీల సంక్షేమానికి ప్రభు త్వం అనేక నిధులు వెచ్చిస్తున్నది. అర్హులైన లబ్ధిదారులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలి. నిరుపేద మైనార్టీ లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించడం దేశంలో ఎకడా లేదు. వంద శాతం రాయితీతో ఆర్థిక సాయం చెకులను ప్రభుత్వం అందిస్తున్నది.
– కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎంపీ
మైనార్టీల ఆర్థికాభివృద్ధికి మైనార్టీబంధు
మైనార్టీలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నది. ప్రభుత్వం మైనార్టీలకు ఆర్థిక సౌలభ్యం చేకూర్చడానికి 100 శాతం బ్యాంకు కన్సెన్ట్ లేకుండా ఆర్థిక సాయం చేసేందుకు మైనార్టీ బంధు పథకం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 20 మందికి రూ.లక్ష చెకులు మంత్రి అందజేశారు. గతంలో మెదక్ జిల్లాలో 112 మంది బ్యాంక్ కన్సెన్ట్తో రుణ లబ్ది పొందేందుకు ఎంపికయ్యారు. అందులోంచి 91 మంది లబ్ధిదారులకు బ్యాంకు కన్సెన్ట్తో రూ.లక్ష ఇచ్చారు.
– రాజర్షి షా, మెదక్ కలెక్టర్
మంత్రి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరిక
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 19: మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన బీజేపీ నాయకురాలు, మా జీ కౌన్సిలర్ చంద్రకళ యాదవ్ దంపతులు, మాజీ జడ్పీటీసీ కిషన్‌గౌడ్‌తో పాటు పలువురు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, అంజాగౌడ్, లింగారెడ్డి, సాప సాయిలు, జుబేర్, రవీందర్, రాములు పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
– మంత్రి హరీశ్‌రావు
మైనార్టీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో 12 మందికి కారుణ్య నియామక పత్రాలు, 51 మందికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, 20 మైనార్టీ కుటుంబాలకు ఆర్థిక సాయం కింద ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది లబ్ధిదారులకు రూ.100 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. మైనార్టీలకు 204 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసి 32,640 మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. దేశంలోనే పంచాయత్‌రాజ్ వ్యవస్థను పటిష్టం చేసి గ్రామాలను అభివృద్ధి చేసి, ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. ట్రాక్టర్లు, ట్యాంకర్లు, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు ఇలాంటి అభివృద్ధి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవన్నారు.
గతంలో 10 పంచాయతీలకు ఒక కార్యదర్శి ఉంటే, నేడు ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. 33 జిల్లాలకు 33 మంది ఐఏఎస్‌లను నియమించిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఒకేసారి 10వేల మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించినట్లు తెలిపారు. ఇది ముందు చూపున్న నాయకుడు సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఇఫో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, అదనపు కల్లెక్టర్లు రమేశ్, జి.వెంకటేశ్వర్లు, జిల్లా మైనార్టీ అధికారి జెమ్లానాయక్, డీపీవో సాయిబాబా, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.