సంగారెడ్డి, ఏప్రిల్ 24: మెదక్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైందని, రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ నామినేషన్ వేయగా మంత్రితో పాటు జుక్కల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ హాజరయ్యారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా కాంగ్రెస్‌కే ఉందని నమ్ముతున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదు ఇప్పటికే అమలు చేసి చూపించామని, త్వరలో మరో గ్యారెంటీని అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ లతో పాటు హామీలను పక్కాగా అమలు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్ముతున్నారని, అత్యధిక స్థానాలను కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, లక్ష్మీకాంత్‌రావు, మదన్మోహన్రావు, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ ఉన్నారు.