సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 5: రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని వైద్యారో గ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై శనివారం సంగారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరం లో కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సన్నరకం, దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లకు వేర్వేరు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఏ-గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ.2320, సాధారణ రకానికి రూ.2300 చొప్పున మద్దతు ధర చెల్లించడం తోపాటు సన్న రకానికి ప్రభుత్వం అదనంగా రూ.500 చొప్పున బోనస్ అందించనున్నదని తెలిపారు. జిల్లాకు ఇతర రాష్ర్టాల నుంచి సన్నరకం ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున, అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సమన్వయం తో ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని యంత్రాంగానికి కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.