సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 9: ఇటీవల కురిసిన వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో ముంపునకు గురైన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని రెవెన్యూ కాలనీ, శ్రీచక్ర కాలనీలను మాజీఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి సందర్శించారు.
ఆయా కాలనీలు వరద నీటిలో ఉండడంతో నీటి పారుదల శాఖ, మున్సిపల్ శాఖల అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాలనీలకు వరద రాకుండా చర్య లు తీసుకోవాలని నీటి పారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. పట్టణానికి ఆనుకొని ఉన్న ఎర్రకుంట, చంద్రయ్య కుంటల్లో వరద కాలువలు పూడుకపోవడం, ఎర్రకుంట తూము చిన్నగా ఉండడం, అధిక వర్షాలతో వరద బయటకు వెళ్లకుండా కాలనీలోకి ప్రవేశించి దాదాపు 130 ఇండ్లల్లోకి చేరిందన్నారు.
వెం టనే తగిన చర్యలు చేపట్టాలని, మరోసారి వరద ఇండ్లల్లోకి రాకుండా చూడాలన్నారు. మంత్రి వెంట సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నీటి పారుదలశాఖ, మున్సిపల్ శాఖల అధికారులు ఉన్నారు. అనంతరం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన మంత్రి అధిక వర్షాల వల్ల ఎదురవుతున్న సమస్యలపై సమీక్షించారు.