పుల్కల్,డిసెంబర్ 8 : పర్యాటక కేంద్ర ంగా సింగూరు అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.ఆదివారం సింగూరు ప్రాజెక్టును ఇండియా సీఎస్ఆర్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి మిచెల్ డొమినికతో కలిసి మంత్రి సందర్శించారు.ఈ సందర్భంగా ప్రాజెక్టు గురించి వారికి వివరించారు.ప్రాజెక్టు మధ్యలో ఐలాండ్ నిర్మించేందుకు అనువైన స్థలం నాలుగు ఎకరాల వరకు ఉంటుందని, ప్రాజెక్టు పూర్తిగా నిండినా ఆ స్థలం ఎప్పుడూ మునిగి పోవడం జరగలేదన్నారు.
అక్కడే ఐలాండ్ నిర్మించి బోటింగ్ ఏర్పాటు చేస్తే సందర్శకులు పెరిగి సింగూరు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు.అనంతరం ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న ఫిష్ ప్రై చేసే వ్యాపారుల వద్దకు వెళ్లి వ్యాపారం గురించి ఆరాతీశారు. అనంతరం పుల్కల్ బాలుర గురుకుల పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రి కాసేపు విద్యార్థులతో మాట్లాడారు.
అందిస్తున్న విద్యాబోధన, భోజనం గురించి ఆరాతీసి సమస్యలు తెలుసుకున్నారు.పాఠశాలకు ప్రహరీ, టాయిలెట్లు నెలలో పూర్తి చేయిస్తానని విద్యార్థులకు మంత్రి హామీ ఇచ్చారు. పక్కనే ఉన్న కెనాల్ కాలువకు త్వరలోనే శంకుస్థాపన చేసి సీసీ లైన్ పనులు ప్రారంభిస్తామని, అందుకు అక్కడ ఉన్న అనువైన స్థలాన్ని శుభ్ర పరచాలని అధికారులకు మంత్రి సూచించారు.
అనంతరం అందోల్లోని పలు విద్యాసంస్థలను మంత్రి పరిశీలించి సౌకర్యాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మహిళా పాలిటెక్నిక్ కళాశాల, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో మంత్రి మాట్లాడారు.మంత్రి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుర్గారెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ రాంచంద్రారెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, గోవర్ధన్, యూత్ అధ్యక్షుడు ఉదయ్, ఎస్ఎస్యూఐ మండల అధ్యక్షుడు ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.