సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 24: సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్‌గా మిక్కిలినేని మనుచౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట కలెక్టరేట్‌కు చేరుకున్న మనుచౌదరికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరీమాఅగ్రవాల్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రెహమాన్ స్వాగతం పలికారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నుంచి ఉదయం 11.40 నిమిషాలకు కలెక్టర్‌గా మను చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది నూతన కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మనుచౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ ముఖ్య పథకాలకు ప్రాధాన్యమిస్తూ పరిపాలనను ప్రజల వద్దకు తీసుకువెళ్లడమే లక్ష్యమన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి వాటిని త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత జిల్లా అధికారులతో ప్రత్యేక చర్యలు చేపడుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులు, అన్ని మౌలిక వసతులు ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరైన మోటివేషన్ ఇప్పించి కార్పొరేట్ స్థాయికి మించి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి భూకబ్జాలు జరుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అబ్దుల్ కలాం చెప్పినట్లు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడి కృషిచేస్తే యువత విజయాలు సాధిస్తారని చెప్పారు.