హుస్నాబాద్, మే 15: యాసంగి పంట మెట్ట రైతులను నిండా ముంచింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది యాసంగి పంట దిగుబడులు సగానికి సగం పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మెట్ట ప్రాం తమైన హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో గడిచిన పదేండ్లు ఎలాంటి అవాంతరాలు లేకుండా యాసంగి పంటలు పండించుకొని ఎలాంటి నష్టాలు లేకుండా జీవనం సాగించిన రైతులు ఈ ఏడాది యాసంగిలో తీవ్రంగా నష్టపోయారు. 2022-23 సంవత్సరంలో సాగునీరు అందుబాటులో ఉం డటం, సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతులకు మంచి దిగుబడులు రావడంతోపాటు పండి న పంటను మద్దతు ధరకు అమ్ముకున్నారు. కానీ ఈ ఏడాది యాసంగిలో సాగునీటి ఎద్దడి వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గడం, సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రం గా నష్టపోవాల్సి వచ్చింది. సాగు చేసిన పంట సగానికిపైగా ఎండిపోవడంతో రైతన్న విలవిలలాడాడు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తక్కువ ధరకే వడ్లను రైస్ మిల్లర్లకు అమ్మా ల్సి వచ్చింది. మెట్ట ప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినప్పటికీ అందులో నీళ్లు నింపకుండా కొందరు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేసి మోటర్లు, పంపులు నడువకుం డా అడ్డుకున్నారు. కనీసం రిజర్వాయర్‌లో నీళ్లుంటే భూగర్భ జలాలు పెరిగి యాసంగి పంట చేతికొచ్చేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలైనా రిజర్వాయర్‌లో నీళ్లు నింపే పనులు గానీ, కాల్వలు తవ్వే పనులపై గానీ దృష్టి సారించక పోవడంపై రైతన్నలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే యాసంగి వరకైనా నీళ్లందుతాయో లేదోననే ఆందోళనలో కర్షకులు ఉన్నారు.
హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో ఐకేపీ, ప్యాక్స్‌ల ద్వారా 2022-23 యాసంగిలో 2,73,339 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా 2023-24 యాసంగిలో కేవలం 1,25,878 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే గతేడాదికి ఈ యేడాదికి ధాన్యం దిగుబడి ఎంత తగ్గిందో తెలుస్తుంది. గతేడాది ఐకేపీ ద్వారా 82, 888 క్వింటాళ్లు కొనుగోలు చేస్తే ఈ ఏడాది కేవలం 30,839 క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. పీఏసీఎస్ ద్వారా గతేడాది 1,90,451 క్వింటాళ్ల ధాన్యం కొంటే ఈ ఏడాది కేవలం 95,039 క్వింటాళ్ల ధాన్యం కొన్నారు.
యాసంగి సీజన్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభం కాకపోవడంతో ముందుగా వరి పంట కోసుకున్న రైతులు వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి తీవ్రంగా నష్టపోయారు. యాసంగి కోతలు మొదలు కాగానే రైస్ మిల్లర్లు, అడ్తీ వ్యాపారులు రైతుల వద్దకెళ్లి కొనుగోళ్లు చేశారు. ఎక్కువమంది రైతులు రైస్‌మిల్లులకు తరలించారు. ప్రభుత్వ మద్ద తు ధర కంటే రూ.150 నుంచి రూ200 వరకు తక్కువ ధరకు విక్రయించారు. దీంతో కొందరు రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. సాగునీటి ఎద్దడితో అంతం త మాత్రంగా పండిన పంటకు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మద్దతు ధర రాక పెట్టిన పెట్టుబడులు కూడా రాకుండా పోయాయి. పదేండ్లలో ఏ సంవత్సరం కూడా ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కోలేదని, కొత్త ప్రభుత్వం రాగానే ఇలాంటి పరిస్థితి దాపురించాయని పలువురు రైతులు వాపోతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో గౌరవెల్లి రిజర్వాయర్ పనులు 99శాతం పూర్తయ్యాయి. మూడు భారీ మోటర్లతో రిజర్వాయర్‌లో అర టీఎంసీ నీటిని నింపారు. పొలాలకు కాల్వల తవ్వకానికి భూసేకరణ సైతం పూర్తయింది. కాల్వల నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కారు రూ.200కోట్ల నిధులు కేటాయించింది. కానీ కొందరు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేయడంతో రిజర్వాయర్‌లో నీళ్లు నింపే పనులు రద్దు అయ్యాయి. రిజర్వాయర్‌లో నీళ్లుంటే హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని వందలాది ఎకరాల్లో యా సంగి పంట ఎండిపోకుండా ఉండేది. కొత్త సర్కారు ఏర్పడ్డాక నీళ్లు పోయించడం గానీ, కాల్వల తవ్వకానికి శ్రీకారం చుట్టడం కానీ చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ నింపి కాల్వల ద్వారా నీళ్లందితేనే పంటలు పుష్కలంగా పండుతాయని రైతులు అంటున్నారు. గౌరవెల్లిపైనే ఈ ప్రాంత రైతన్నలు కోటి ఆశలు పెట్టుకున్నారు.