సిద్దిపేట, జనవరి 6: బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని, దీంతో పేద విద్యార్థులకు వైద్యవిద్య అందుబాటులోకి వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 650 మంది విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి హరీశ్‌రావు బ్లాంకెట్లను పంపిణీ చేశారు. అనంతరం హరీశ్‌రావు విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ… తాను మొదటిసారి 2004లో మంత్రిగా ఉన్నప్పుడు ఈ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయించానని గుర్తుచేశారు. ఈ పాఠశాల అంటే తనకు ఎంతో ఇష్టమని, 22 ఏండ్ల అవినాభావ సంబంధం ఉందని అన్నారు. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న కాస్మోటిక్ చార్జీలను ఆర్థిక మంత్రితో మాట్లాడి విడుదలయ్యేలా చూస్తానన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.14.50 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాలకు పక్కా భవనాన్ని నిర్మించామని హరీశ్‌రావు తెలిపారు.
వైద్యులు, ఇంజినీర్లు తయారవుతుంటే సంతోషంగా ఉంది…
ఈ పాఠశాల నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారంటే చాలా సంతోషంగా ఉందని హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2800 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే, తెలంగాణ వచ్చిన తర్వాత 10,500 సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. కేసీఆర్ హయాంలోనే 34 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గురుకుల పాఠశాలలు 35 ఉన్నాయన్నారు. వీటికి ప్రత్యేక కార్పొరేషన్ లేకపోవడంతో బ్లాంకెట్లు, స్వెట్టర్లు సైప్లె జరగడం ఇబ్బందిగా ఉందని తెలిపారు. 35 గురుకులాలకు తానే చొరవ తీసుకొని కాస్మోటిక్ చార్జీలు ఇప్పించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
గతంలో విద్యార్థులకు వేడి నీటి కోసం సోలార్ ప్యానల్ ఏర్పాటు చేయించామన్నారు. కోతుల బాధతో అవి పాడైపోతున్నాయని తెలిపారు. వేడినీళ్ల కోసం హీటర్స్‌ను మంజూరు చేయించి అందుబాటులోకి తెస్తానన్నారు. ప్రభుత్వం నుంచి కాకపోయిన స్వచ్ఛంద సంస్థల సహకారంతో అయినా ఏర్పాటు చేయిస్తానన్నారు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు సిద్దిపేటలోని మెడికల్ కళాశాలలో సీటు సాధించడం మనందరికీ గర్వకారణం అని హరీశ్‌రావు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మిగతా ఇద్దరు విద్యార్థులు కొత్తగూడెంలో, నిజామాబాద్ మెడికల్ కళాశాలలో మరొకరు సీట్లు సాధించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు సివిల్ సర్వెంట్లుగా, డాక్టర్లుగా వివిధ రంగాల్లో రాణించినప్పుడు తాను చాలా సంతోష పడుతానని హరీశ్‌రావు అన్నారు.
సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వారు సైతం డాక్టర్లుగా తయారైనప్పుడు, ఆ కుటుంబంతో పాటు అందరూ సంతోష పడుతారన్నారు. వేలాది మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించామని గుర్తుచేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రతా కల్పించామన్నారు. మిగతా కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం భవిష్యత్తులో కృషి చేస్తానని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగుల స్రవంతి ప్రశాంత్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, సుడా మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ప్రిన్సిపాల్ విష్ణువర్దన్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అల్లం ఎల్లం తదితరులు పాల్గొన్నారు.