మెదక్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో గతేడాది కంటే ఈ సంవత్సరం క్రైం రేట్ పెరిగిందని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నందున కొంతమేరకు తగ్గాయన్నారు. 2021లో 463 ప్రమాదాల్లో 283 మంది, 2022లో 460 ప్రమాదాల్లో 232 మంది మృతి చెందారన్నారు. సైబర్ క్రైం కేసులు 2021లో 27 కాగా, 2022లో 115 కేసులు నమోదయ్యాయన్నారు. డ్రంకన్ అండ్ డ్రైవ్‌లో 2022లో 8011 కేసులు నమోదై ఐదుగురికి జైలు శిక్ష పడిందన్నారు. హత్యలు, లైంగికదాడులు, దోపిడీలు, చోరీలు ఎక్కువగా జరిగాయన్నారు. మహిళలపై నేరాలు 336 నమోదయ్యాయి. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి, మెదక్ డీఎస్పీ సైదులు, తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఐలు మధు, విజయ్‌కుమార్, చంద్రశేఖర్, గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి, డిసెంబర్ 28: జిల్లాలో పోలీస్ యంత్రాంగం పటిష్టంగా పని చేయడంతో నేరాల సంఖ్య తగ్గిందని, 2022లో 6,247 కేసులు నమోదయ్యాయని సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ వెల్లడించారు. బుధవారం స్థానిక పోలీస్ కల్యాణ మండపంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ ఏడాదిలో జరిగిన నేరాల వివరాలు తెలిపారు. ఉత్తమ సేవలందించిన పోలీసులకు ప్రశంసాపత్రాలు, నగదు పురస్కారాలు అందజేసి, అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ ఏడాదిలో కేసులతో పాటు రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు. కర్ణాటక, మహారాష్ట్రకు రేషన్ బియ్యం తరలిస్తున్న 82 వాహనాలు పట్టుకుని, 13 వేలకు పైగా క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉంటేనే ఆ సంఖ్య తగ్గుతుందన్నారు. ఓటీపీ, కేవైసీలు, క్యూఆర్ కోడ్లను ఎవరైనా అడిగితే చెప్పొద్దన్నారు. లాటరీలు వచ్చాయని అడిగితే వివరాలతో పాటు అలాంటి లింక్‌లు ఓపెన్ చేయవద్దన్నారు.
ఈ నెల 31న విందులు, వినోదాలు చేసుకునే వారు సమీప ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. పోలీసుల అనుమతి లేకుండా డీజేలు పెట్టి ఇబ్బందులు కలిగిస్తే, అలాంటి వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నియమనిబంధనలు పాటించాలన్నారు. సమావేశంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ జలేందర్‌రెడ్డి, పట్టణ సీఐ శ్రీధర్‌రెడ్డి, ఏఆర్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.