మెదక్ మున్సిపాలిటీ, మే 3: మెదక్ పట్టణంలోని పలు హోటళ్లు, బేకరీలు, స్వీట్ హౌస్‌లలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో శనివారం అకస్మికంగా దాడులు నిర్వహించారు. నాణ్యత లేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొని నిర్వహకులకు జరిమానాలు విధించారు.
ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ.. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో గల హోటళ్లు, బేకరీలు, స్వీట్ హౌస్ తనిఖీలు చేపట్టడం జరిగిందని అన్నారు. హోటళ్లు, బేకరీలు, స్వీట్ హౌస్ నిర్వాహకులు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిల్వ చేసిన, కుళ్లిన ఆహార పదార్థాలు ఉంచరాదని, ఏ రోజు తినుబండరాలు ఆ రోజే తయారు చేసి విక్రయించాలన్నారు. ఆహార పదార్థాలపై దుమ్ము ధూళి పడకుండా తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. హోటళ్లను శుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని ఆదేశించారు. నిబంధనలు ఆక్రమిస్తే మున్సిపల్ చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి హోటల్ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని ఆదేశించారు.