Suspicious Death | మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 11: మెదక్ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సంజీవ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత పదేండ్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పారిశుద్ధ్య విభాగంలో జవాన్‌గా విదులు నిర్వహిస్తున్న సంజీవ్‌ను మూడు నెలల క్రితం పారిశుద్ధ్య విభాగం అధికారులు విధుల నుంచి తప్పించి, డంపింగ్ యార్డులో విధులు నిర్వహించాలని ఆదేశించారు. కాగా, గతేడాది డిసెంబర్ 31న డ్యూటీకి వెళ్లిన సంజీవ్ రాత్రి వరకు ఇంటికి రాలేదు. దీంతో ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన డంపింగ్ యార్డుకు వెళ్లి చూడగా షెడ్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు మృతుడి సెల్ఫోన్లో సెల్పీ వీడియో బయటికి రావడంతోపాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో పోలీసులు చర్యలకు సిద్దమయ్యారు.
సంజీవ్ ఆత్మహత్యకు పాల్పడే ముందు సెల్ ఫోన్లో ఇద్దరు అధికారులతో పాటు సహచర సిబ్బంది ఒకరు వేధిస్తున్నారని వారిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేగాక తన ఉద్యోగం తన కుమారునికి ఇప్పించాలని సెల్పీ వీడియోలో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో సంబంధిత ఇద్దరు అధికారులు, మరో ఉద్యోగిని సోమవారం సాయంత్రం పోలీసులు విచారించారు. మంగళవారం సంజీవ్ కుటుంబ సభ్యులను విచారించారు. సెల్పీ వీడియోలో సంజీవ్ పేర్కొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై పట్టణ సీఐ నాగరాజును వివరణ కోరగా కేసు విచారణ కొనసాగుతుందన్నారు.