సంక్షేమం, వినూత్న పథకాల అమలు, సమర్థ పాలన..ఇలా ఏ రంగంలో చూసినా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా మారిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. పాపన్నపేట మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా ఇన్చార్జి ఎగ్గేమల్లేశంతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం రాకముందు పాలించిన వారి అసమర్థతతో నీటికి, కరెంట్‌కు, రోడ్లు బాగాలేక, అనేక విధాలుగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కున్నట్లు గుర్తుచేశారు. ఎట్లుండె తెలంగాణ ఇప్పుడు ఎట్లయ్యిందో ఒకసారి ఆలోచన చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పేదలను ఆదుకుంటుంటే, ప్రధాని నరేంద్రమోదీ అన్ని ధరలు పెంచి పేదలపై భారం మోపుతున్నట్లు తెలిపారు. మెదక్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఆమె అన్నారు. ఇన్చార్జి ఎగ్గే మల్లేశం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తేవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంతకుముందు ఆత్మీయ సమ్మేళనానికి ఓపెన్ టాప్ జీపులో వచ్చిన నేతలకు ప్రజలు నీరాజనం పట్టారు.
పాపన్నపేట, ఏప్రిల్ 19: అభివృద్ధి పనులతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. పాపన్నపేట మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ఎమ్మెల్సీ, జిల్లా ఇన్చార్జి యెగ్గె మల్లేశంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 70 ఏండ్ల పాటు రాష్ర్టాన్ని పాలించిన పార్టీలకు తెలంగాణను అభివృద్ధి చేయాలనే ఆలోచనే రాలేదని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి తక్కువ సమయంలోనే సీఎం కేసీఆర్ కృషితో నీటి సమస్య, కరెంట్ కోతల నుంచి విముక్తి లభించిందన్నారు. 24 గంటల కరెంటుతో పాటు లక్షలాది ఎకరాలకు పంట పండించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుంటున్నదని ఆరోపించారు.
పేద ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మోయలేదని భారం వేస్తున్నదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రో, డీజిల్ ధరలు పెంచడంతో అన్నింటిపైనా భారం పడుతున్నదన్నారు. వ్యవసాయ పెట్టుబడులు పెరిగి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అప్పట్లో రూ.400 కు ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు రూ.1,200కు చేరిందన్నారు.
గతంలో సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని నాటి రోజులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామలం అవుతున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఆడపడుచులు తాగునీటికి బయటకు వెళ్లే బాధ తప్పిందని, ఇంటింటికీ నల్లానీళ్లు వస్తున్నాయన్నారు. చెరువులు మంచిగ చేసుకున్నట్లు చెప్పారు. గతంలో సింగూరు నీరు హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకే ఇచ్చేవారని, సీఎం కేసీఆర్ ఆ నీటిని మెదక్ జిల్లా అవసరాలకే కేటాయించినట్లు తెలిపారు. మెదక్ జిల్లాలో వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలంగా మారాయన్నారు.
కొన్నేండ్లుగా మెదక్ నియోజకవర్గ ప్రజలు తనను సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారని, వారి రుణం జన్మలో తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. పాపన్నపేటలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి వస్తుంటే దారి పొడవునా ప్రజలు పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారని, ఈ ఉద్విగ్న భరిత క్షణాలు మరువలేనివన్నారు.
పాపన్నపేటలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఓపెన్ టాప్ జీపులో వచ్చిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి యెగ్గె మల్లేశం, ఇతర నేతలకు పాపన్నపేట ప్రజలు నీరాజనం పట్టారు. దారిపొడవునా పూలవర్షం కురిపించారు. పటాకులు, డప్పు చప్పుల్ల మధ్య నృత్యాలు చేస్తూ సభాస్థలికి తీసుకెళ్లారు. మార్గమధ్యలో సుభాశ్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి గజమాల వేసి సత్కరించారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుమ్మరి జగన్, రైతుబంధు సమితి నాయకులు సోములు గడీల శ్రీనివాస్‌రెడ్డి, ఏడుపాయల ఆలయ చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, సీనియర్ నాయకులు సుభాశ్‌చందర్, పాపన్నపేట సర్పంచ్ గురుమూర్తిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
– ఎమ్మెల్సీ, మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి యెగ్గె మల్లేశం
మొక్కవోని దీక్షతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ఎమ్మెల్సీ, మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి యెగ్గె మల్లేశం అన్నారు. దేశమే నివ్వెరపోయేలా, ఎక్కడా లేని వినూత్న పథకాలు ప్రవేశపెట్టి అన్ని రాష్ర్టాలకు తెలంగాణను రోల్ మోడల్‌గా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఏ పథకం చూసినా ప్రజల మన్ననలు పొందుతున్నదని, వీటిని చూసి ప్రజలు మళ్లీ కేసీఆర్‌కే పట్టం కడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని, బీజేపీ, కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.