మెదక్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ):మెదక్ నుంచి తిరుపతికి వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి రైల్వేబోర్డు అధికారులకు విన్నవించారు. శుక్రవారం హైదరాబాద్‌లో రైల్వే బోర్డు డీఆర్‌యూసీసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి హాజరై రైల్వే అధికారులకు పలు సమస్యలపై వినతులు అందజేశారు. 15 అంశాలపై ప్రస్తావించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్ నుంచి తిరుపతికి వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్‌ను నడపాలని ప్రతిపాదించగా, సానుకూలంగా స్పందించిన రైల్వే అధికారులు ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించారు.
త్వరలో మెదక్-తిరుపతి రైలు నడిపేలా చర్యలు తీసుకుంటామని వారు చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అజంతా, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అక్కన్నపేట, మిర్జాపల్లి స్టేషన్లలో ఆపాలని కోరారు. మెదక్-చేగుంట మార్గంలో చేగుంట వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం గురించి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.