Medak | చిన్నశంకరంపేట : తాతముత్తాతల నుంచి తమ పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని.. ఎవరో వచ్చి భూమి మాదంటే ఊరుకునేది లేదని రైతులు హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండలం పరిధి కామారంతండా భూ సర్వే కోసం వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తండాకు చెందిన కెతావత్ హరినాయక్, శక్రు నాయక్‌లకు సర్వేనెంబర్లో 147, 158, 141, 144లలో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అయితే, ఈ నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని 2007లో దాట్ల వెంకటరామరాజు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
శుక్రవారం దాట్ల వెంకటరామరాజు హద్దులు నాటేందుకు జిల్లా సర్వేయర్ ఏడీ శ్రీనివాస్, ఎస్ఐ నారాయణ, రెవెన్యూ అధికారుల సమక్షంలో సర్వేని నిర్వహిస్తుండగా రైతులు సర్వేను అడ్డుకొని ఆందోళనకు దిగారు. దాట్ల వెంకటరామరాజు మాకు ఎవరో తెలియదని.. ఈ భూమిని ఎవరికి అమ్మలేదని ఫోర్జరీ సంతకాలు సృష్టించి.. నకిలీ పత్రాలతో సదరు వ్యక్తి తమ భూమిని లాక్కొవాలని చూస్తున్నాడని అధికారులకు తెలిపారు. పోలీసుల సమక్షంలో సర్వేనెంబర్ 141, 144లో భూమిని సర్వేచేసి అధికారులు అక్కడ నుండి వెళ్లిపోయారు. తమ భూమిని అన్యాయంగా ఆక్రమిస్తే చావే శరణ్యమని పేర్కొన్నారు.