ప్రకృతిని ఆరాధించే ఆడబిడ్డల పండుగ వచ్చింది. ఆ సంబురాన్ని ఆనందంతో జరుపుకొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఏడాది బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా బతుకమ్మ వేడుకలకు అర్హులైన మహిళలకు టీఆర్ఎస్ సర్కారు సారె పెట్టనున్నది. ఇందుకోసం ఇప్పటికే మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ప్రభుత్వం అందజేసే చీరెలను కట్టుకుని బతుకమ్మ ఆడిపాడేందుకు మెతుకుసీమ ఆడబిడ్డలు సిద్ధమవుతున్నారు.
మెదక్, (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి, సెప్టెంబర్ 8: ప్రతి ఏడాది బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు ఉచితంగా చీరెల పంపిణీ చేస్తున్నది. ఇందుకోసం బతుకమ్మ చీరెలు విడతల వారీగా జిల్లాలకు చేరుకుంటున్నాయి. రేషన్ కార్డులు కలిగి ఉండి, 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు ఈ చీరెలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో 2.86 లక్షల మంది మహిళలకు చీరెలు పంపిణీ చేయనుండగా, సంగారెడ్డి జిల్లాలో 4,97,146 మంది మహిళలను అర్హులుగా గుర్తించారు. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న చీరెలను గోదాంలలో భద్రపర్చగా, త్వరలోనే ఆడబిడ్డలకు పంపిణీ చేయనున్నారు.
జహీరాబాద్‌లో అత్యధికం..
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 1,18,234 మంది మహిళలను గుర్తించినట్లు జౌళిశాఖ అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రేషన్‌కార్డుల ప్రాతిపదికన చీరెల పథకానికి మహిళలను ఎంపిక చేయడంతో జహీరాబాద్ ప్రాంతంలో మహిళలు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. బతుకమ్మ వేడుకలకు 4 రోజుల ముందే చీరెలను అందజేసేందుకు గ్రామస్థాయిలో కమిటీలను నియమించారు. గ్రామస్థాయిలో చీరెలను నిల్వ చేసేందుకు పంచాయతీ, పాఠశాల భవనాలు, అందుబాటులో ఉన్న ఇతర భవనాల్లో గుర్తించి ఉంచాలని జిల్లా పంచాయతీ అధికారి సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. జాబితా ఆధారంగా గ్రామస్థాయిలో నిల్వ కేంద్రాలు అందుబాటులో ఉంచారు. బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మెదక్ జిల్లాలో 2.86 లక్షల చీరెలు పంపిణీ..
మెదక్ జిల్లాలోని 21 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల్లో 521 రేషన్ దుకాణాల ద్వారా 2.86 లక్షల చీరెలను పంపిణీ చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 2 లక్షల చీరెలు చేరుకున్నాయి. జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డు గోదాములో చీరెలను భద్రపరిచారు. మెదక్ జిల్లాలో 2.16 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉండగా, ఒక్కో కార్డుపై ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు ఆడపడుచులు కూడా ఉన్నారు. వివిధ రంగులు, రకాల డిజైన్లతో నేసిన చీరెలను పంపిణీ చేయనున్నారు. పెద్ద వారికి తొమ్మిది మీటర్ల చీరెలు, చిన్న వారికి ఆరు మీటర్ల చీరెలను సరఫరా చేయనున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి చీరెల పంపిణీ చేపట్టనున్నారు. 18 ఏండ్లు నిండి ఆహారభద్రతా కార్డులో పేరు నమోదై ఉన్న వారందరికీ ఈ చీరెలను పంపిణీ చేయనున్నారు.

సంగారెడ్డి జిల్లాలో పెరిగిన లబ్ధిదారుల సంఖ్య
గత ఏడాదితో పోల్చితే ఈసారి అర్హులైన మహిళల సంఖ్య 17,146 వేలకు పెరిగింది. 18 ఏండ్లు నిండిన మహిళలందరికీ చీరెలు పంపిణీ చేస్తుండగా, జిల్లాలో గతేడాది చీరెల పంపిణీకి 4.80 లక్షల మహిళలు అర్హులుగా గుర్తించారు. ఈ సారి 4,97,146 మంది మహిళలు చీరెల పంపిణీకి అర్హులుగా అధికారులు గుర్తించారు. వీరందరికీ బతుకమ్మ చీరెలు అందించనున్నారు. ఇప్పటికే సగానికిపైగా చీరెల వాహనాలు జిల్లా చేరి గోదాంల్లో నిలిచి ఉన్నాయి. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఏఎంసీ ముత్తంగి, జహీరాబాద్ పరిధిలోని దిగ్వాల్, నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని కంగ్టి గోదాంలను చీరెల నిల్వకోసం కలెక్టర్ కేటాయించారు. మరోరెండు రోజుల్లో మొత్తం చీరెలు జిల్లా రానున్నాయని చేనేత, హాండ్లూమ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
అర్హులందరికీ చీరెల పంపిణీ
ఆహార భద్రత కార్డుల ఆధారంగా 18 ఏండ్లు నిండిన వారికి పంపిణీ చేయనున్నాం. తహసీల్దార్ల పర్యవేక్షణలో బతుకమ్మ చీరెల పంపిణీ జరుగుతుంది. అర్హులందరికీ పంపిణీ చేసేవిధంగా చర్యలు తీసుకుంటాం. మెదక్ జిల్లాలోని 521 రేషన్ దుకాణాల ద్వారా 2.86 లక్షల మందికి బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తాం.
– శ్రీనివాస్, మెదక్ డీఆర్డీవో