పారిశ్రామికవాడల్లో అన్ని వసతులు కల్పించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో మంత్రి పర్యటించారు. పాశమైలారం ఐడీఏ నుంచి కర్దనూర్‌కు రూ.120.20 కోట్లతో వేయనున్న నాలుగులేన్ల రోడ్డు, రుద్రారం గణేశ్ ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పటాన్చెరు నూతన మార్కెట్ కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలకు 24గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నదని, కొత్త రోడ్డుతో పాశమైలారం ఇండస్ట్రియల్ ప్రాంతం ట్రాఫిక్ ఫ్రీగా మారుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రైతులకు శాపంగా మారాయని మండిపడ్డారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయతో తెలంగాణ భూముల్లో బంగారం పండుతున్నదని, ఇక్కడ పంటలను బేషరతుగా కొనాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

పటాన్చెరు/ పటాన్చెరు టౌన్, సెప్టెంబర్ 10: పారిశ్రామికవాడలకు కొత్త రూపు తీసుకువస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం పటాన్చెరు మండలంలోని పాశమైలారం ఐడీఏలో రూ.121.20 కోట్లతో నిర్మిస్తున్న పాశమైలారం-కర్దనూర్ ఓఆర్ఆర్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. రుద్రారంలో గణేశ్ దేవస్థానంలో రూ.4.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పటాన్చెరు మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ బాయికాడి విజయ్‌కుమార్, నూతన పాలకమండలికి ప్రమాణ స్వీకారం చేయించి, పాలకమండలిని మంత్రి అభినందించి సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో పారిశ్రామికవాడలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. పరిశ్రమలకు గతంలో విద్యుత్ కోతలుండేవని, టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కోతలను నివారించి 24గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందజేస్తున్నదని గుర్తు చేశారు. దేశంలో విద్యుత్ కోతలు లేనిరాష్ట్రం తెలంగాణ అని మంత్రి అన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు పారిశ్రామికవాడలకు రోడ్డు సౌకర్యం కూడా కల్పిస్తున్నామన్నారు. ఇస్నాపూర్‌లో ఎంత ఖర్చుచేసినా ట్రాఫిక్ సమస్య ఆగట్లేదని గుర్తించి కొత్త రోడ్డును మంజూరు చేస్తున్నామన్నారు.
రూ.121.20 కోట్లతో పాశమైలారం నుంచి కర్దనూర్ ఓఆర్ఆర్ వరకు నాలుగులైన్ల రోడ్డును వేస్తున్నామన్నారు. అన్ని సౌకర్యాలతో వేస్తున్న ఈ రోడ్డుతో పాశమైలారం ఇండస్ట్రియల్ ట్రాఫిక్ కష్టాలు తీరి ప్రయాణం సులువుగా మారుతుందన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారని మంత్రి తెలిపారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం, పటాన్‌చెరుకు మంజూరైన 300 పడకల దవాఖాన పనులకు శంకుస్థాపన చేస్తారని, ఈ సందర్భంగా రెండుచోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి దశాదిశా లేదని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కేంద్ర నిర్ణయాలు రైతులకు శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నూకల ఎగుమతి మీద నిషేధం విధించడంపై మంత్రి మండిపడ్డారు. దేశంలో ఆహారం నిల్వలు తగ్గినప్పుడు నిషేధం విధిస్తారు, మంత్రి నిరంజన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్రం తెలంగాణ బియ్యం కొనాలని అడిగితే కేంద్రం కొనకుండా, మీరు నూకలు తినాలని ఎద్దేవా చేసిందని గుర్తు చేశారు. కేంద్రం వద్ద నాలుగు ఏండ్లకు సరిపడా ఆహార నిల్వలున్నాయని చెప్పి, ఇప్పుడు నూకలు, బియ్యం ఎగుమతులను ఎలా నిషేధిస్తారని ప్రశ్నించారు. కేంద్ర పన్నుల విధానంతో రైతుల పెట్టుబడి పెరిగి రైతుల ఆదాయం తగ్గిందన్నారు. సగం దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని మంత్రి అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 జిల్లాల్లో 72 లక్షల ఎకరాల్లో వరి పండితే ఇప్పుడు తెలంగాణలోని 10 పూర్వపు జిల్లాల్లో 65 లక్షల ఎకరాల్లో వరి పండుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆకుపచ్చటి రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేశారన్నారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ పథకాలతో తెలంగాణ భూముల్లో ధాన్యపురాసులు పండుతున్నాయన్నారు. కేంద్రం అసంబద్ధమైన మాటలతో ప్రజలను మోసం చేస్తున్నదని దుయ్యబట్టారు. తెలంగాణలో పండే పంటలను కేంద్రం భేషరతుగా కొనాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మార్కెట్ కమిటీకి కొత్త చైర్మన్ విజయ్‌కుమార్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. విజయ్‌కుమార్ నేతృత్వంలో పటాన్చెరు మార్కెట్ యార్డు ఆదర్శ మార్కెట్ కావాలని ఆకాంక్షించారు. డైరెక్టర్లు, అధికారుల సమన్వయంగా పనిచేసి రైతులకు మేలు జరిగేలా చూడాలని సూచించారు. రూ.300 కోట్ల విలువైన మార్కెట్ స్థలాన్ని ఎమ్మెల్యే కోరిక మేరకు ఒక్కరోజులో సీఎం పర్మిషన్ ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ సర్కార్ రైతు పక్షపాతి అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఎస్ ఆర్డీసీ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, సంగారెడ్డి కలెక్టర్ శరత్, శాసనమండలి మాజీ చైర్మన్ వీ.భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ, జడ్పీ వైస్‌చైర్మన్ కుంచాల ప్రభాకర్, ఎంపీపీలు సుష్మశ్రీవేణుగోపాల్‌రెడ్డి, ఈర్ల దేవానంద్, ప్రవీణావినయ్ భాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీలు సుప్రజావెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, కార్పొరేటర్లు మెట్టు కుమార్యాద వ్, సింధూఆదర్శ్‌రెడ్డి, పుష్పానగేశ్, మున్సిపల్ చైర్మన్లు పాండురంగారెడ్డి, సర్పంచ్‌లు ఉపేందర్ముదిరాజ్, భాగ్యలక్ష్మి, బాలామణి శ్రీశైలం, చంద్రయ్య, లక్ష్మయ్య, సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు శ్రీశైలంయాదవ్, యాదగిరియాదవ్, ఎంపీటీసీలు మన్నెరాజు, హరిప్రసాద్‌రెడ్డి, గడ్డం శ్రీశైలం, అంజిరెడ్డి, టౌన్ప్రెసిడెం ట్ ఎండీ అఫ్జల్, వెంకటేశంగౌడ్, గూడెం మధుసూదన్‌రెడ్డి, మా జీ సర్పంచ్‌లు సుధాకర్‌గౌడ్, వెంకన్న, గోపాల్‌రెడ్డి, ఉప సర్పంచ్‌లు ఎం.కృష్ణయాదవ్, వడ్డేకుమార్, టీఆర్ఎస్ నాయకులు దశరథరెడ్డి, మెరాజ్‌ఖాన్, అశోక్, బీ.వెంకట్‌రెడ్డి, షకీల్, ఆదర్శ్‌రెడ్డి, చందుముదిరాజ్, రామకృష్ణముదిరాజ్, శ్రీధర్‌చారి, అక్రమ్పాష తదితరులున్నారు.
రుద్రారం సిద్ధి గణపతి దేవస్థానంలో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. రూ.4.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు రాజగోపురాలు, నిత్య అన్నదాన సత్రం, కల్యాణ మండపం, 24 దుకాణాల సముదాయ నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఔటర్ రింగురోడ్డు నుంచి పటాన్‌చెరులోని కార్యక్రమాలకు టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన జీప్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిలను స్వాగతం పలుకుతూ పెట్టిన వాహనశ్రేణి ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నది. “జై తెలంగాణ” నినాదాలతో వాహనాలు మంత్రి వాహనం ముందు కదిలాయి.
అభివృద్ధి పనులు వేగవంతం చేశాం. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పటాన్చెరును ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తున్నాం. పాశమైలారం నుంచి కర్దనూర్ రింగ్‌రోడ్డు జంక్షన్ వరకు వేస్తున్న రూ.121 కోట్లతో రోడ్డు నిర్మాణంతో కార్మికులకు, పరిశ్రమలకు రాకపోకలు పెరుగుతాయి. గణేశ్ దేవస్థానంలో చేస్తున్న అభివృద్ధి పనులతో భక్తులకు సౌకర్యాలు పెరుగుతాయి. గణేశ్ దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తాం. పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చక్కగా పనిచేయాలి. కొత్త చైర్మన్ విజయ్‌కుమార్ చక్కటి పనితీరుతో మార్కెట్ యార్డుకే రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తేవాలి. కొత్త చైర్మన్‌కు, అధ్యక్షుడికి శుభాకాంక్షలు.
– ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి