పటాన్చెరు, సెప్టెంబర్ 9;ఐడీఏ పాశమైలారం పారిశ్రామికవాడకు ఇక ప్రయాణం సాఫీగా సాగనున్నది. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లకు విముక్తి లభించనున్నది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్-పాశమైలారం రోడ్డుకు మహర్దశ పట్టనున్నది. నిత్యం వేలాదిమంది కార్మికులు, వందల కొద్ది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రోడ్డును నాలుగు లేన్లుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.121 కోట్లు కేటాయించింది. నేడు మంత్రి హరీశ్‌రావు ఈ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గతంలో ఈపారిశ్రామికవాడకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను పారిశ్రామికవేత్తలు పాశమైలారం నుంచి కర్ధనూర్ జంక్షన్ వరకు నాలుగు లేన్ల రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన కేటీఆర్ తక్షణం అధికారులకు ఆదేశించారు. రోడ్డు నిర్మాణంతో భూములు కోల్పోతున్న కొందరు రైతులు, ప్లాట్ల ఓనర్లు కోర్టుకు వెళ్లడంతో పనులు ఆలస్యమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని వివాదాలన్నీ పరిష్కరించారు. దీంతో రోడ్డు నిర్మాణ పనులకు మార్గం సుగమమైంది. 150 ఫీట్లతో విశాలంగా రోడ్డు వేయడంతో పాటు డివైడర్ ఏర్పాటు చేసి పచ్చదనం కల్పిస్త్తారు. బటర్‌ఫ్లై ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తారు. దీంతో రాత్రిళ్లు రోడ్డు విద్యుత్ కాంతులతో జిగేల్ మననున్నది.
ఐడీఏ పాశమైలారం జంక్షన్ నుంచి కర్ధనూర్ రింగురోడ్డు చౌరస్తా వరకు వేస్తున్న రోడ్డు పనులకు శనివారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. రూ.121.20 కోట్లతో ఈ నాలుగులైన్ల బీటీ రోడ్డును వేస్తున్నారు. రింగురోడ్డు వరకు కలుపుతున్న ఈరోడ్డు 4.658 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డు పనులు ప్రారంభం కాకుండా భూములు కోల్పోతున్న వారు కోర్టుకు నష్టపరిహారం కోసం వెళ్లగా, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి టీఎస్ఐఐసీ, జిల్లా అధికారులతో కలిసి సమస్య పరిష్కరించేలా చేశారు. రూ.76.2 కోట్లు నష్టపరిహారంగా అందేలా చూశారు. రూ.45 కోట్లతో నాలుగులైన్ల రోడ్డును నిర్మిస్తున్నారు. రోడ్డు 150 ఫీట్లతో, రోడ్డు మధ్యలో డివైడర్ పచ్చదనంతో ఉంటుంది. బటర్‌ఫ్లై ఎల్ఈడీ లైట్లను ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో పటాన్చెరు పట్టణానికి, నగరానికి ఇస్నాపూర్ వెళ్లాల్సిన అవసరం ఉండదు, దూరం తగ్గుతుంది. బెంగళూర్ వైపుగా వెళ్లే వాహనాలు నేరుగా శంకర్పల్లి వైపు వెళ్లిపోతాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు ముత్తంగి జంక్షన్ నుంచి తెలిగ్గా వెళ్లవచ్చు.
అమ్మో ఇస్నాపూర్ ట్రాఫిక్ జాం
ఇస్నాపూర్‌లో ట్రాఫిక్ జాం అనగానే ప్రయాణికులు, కార్మికులు అమ్మో అనేవారు. గంటల పాటు పాశమైలారం నుంచి ఇస్నాపూర్ చౌరస్తా వరకు ప్రయాణించిన రోజులున్నాయి. మూడు కిలోమీటర్ల ప్రయాణమైన తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఉండేది. ఈ మధ్యకాలంలో ఇస్నాపూర్ చౌరస్తా ప్రాంతంలో పారిశ్రామికవేత్తల సహకారంతో ఎన్‌హెచ్ 65 అధికారులు రోడ్డును కిలోమీటర్ మేర అభివృద్ధి చేశారు. అయినా ఇస్నాపూర్ నుంచి ఐడీఏ పాశమైలారం వరకు ఉన్న రోడ్డుకు ఇరువైపులా వ్యాపార సముదాయాలు, చిరువ్యాపారుల బండ్లు అడ్డం ఉండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతున్నది. ఇప్పుడు తెలంగాణ సర్కార్ రూ.121.2 కోట్లు ఖర్చు చేసి పారిశ్రామికవాడకు ప్రత్యేక రోడ్డు వేస్తుండటాన్ని అందరు స్వాగతిస్తున్నారు. అన్ని హంగులతో వస్తున్న ఈరోడ్డు కారణంగా పారిశ్రామికవాడ రూపురేఖలు కూడా మారబోతున్నాయి. ఇంద్రకరణ్ వరకు పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయి. దాదాపు 50వేల నుంచి 60వేల మందికి ఉపాధి కల్పిస్తున్న పారిశ్రామికవాడ ప్రజల, కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నారు.
జిల్లాలోనే అత్యధిక ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రాంతం ఇస్నాపూర్-పాశమైలారం రహదారి. గంటల పాటు వాహనాల రద్దీకి ఈ ప్రాంతం పెట్టింది పేరు. సుమారు ఐదు వందల పరిశ్రమలున్న పారిశ్రామికవాడకు నిత్యం 50వేల మంది కార్మికులు, అధికారులు, సిబ్బంది ఈ రోడ్డుపై ప్రయాణిస్తారు. దీంతో ఈ ప్రాంతంలోని మూడు కిలోమీటర్ల రహదారి పూర్తిగా ఇరుకుగా మారింది. పారిశ్రామికవాడకు వస్తున్న వేలాది వాహనాలతో ట్రాఫిక్ జాం కావడం నిత్యకృత్యంగా మారింది. ఈనేపథ్యంలో పారిశ్రామికవాడకు వచ్చిన ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌కు పారిశ్రామికవేత్తలు పాశమైలారం నుంచి కర్ధనూర్ జంక్షన్ వరకు నాలుగు లైన్ల రోడ్డు కావాలని కోరారు. స్పందించిన మంత్రి కేటీఆర్ తక్షణం టీఎస్ఐఐసీ, ఆర్‌అండ్‌డీకి రోడ్డు వేసేందుకు ఆదేశాలిచ్చారు. తక్షణం జీవో కూడా విడుదల చేయించారు. మధ్యలో కొందరు భూములు కోల్పోతున్న రైతులు, ప్లాట్ల ఓనర్లు కోర్టుకు వెళ్లడంతో పనులకు అంతరాయం ఏర్పడింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రత్యేక చొరవతో వివాదాలన్నీ పరిష్కరించేలా చూశారు. శనివారం పటాన్చెరులో పర్యటిస్తున్న మంత్రి హరీశ్‌రావు రూ.121.2 కోట్లతో వేస్తున్న నాలుగులైన్ల రోడ్డు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నారు. ఈ రోడ్డు పనులు ప్రారంభమవుతుడడంతో పారిశ్రామికవేత్తలు స్వాగతిస్తున్నారు. కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి పర్యటన వివరాలు
మంత్రి హరీశ్‌రావు ఉదయం 10 గంటలకు పాశమైలారం-కర్దనూర్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో రుద్రారం సిద్ధి గణపతి దేవస్థానం ఆవరణలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. రాజగోపురం, అన్నదాన సత్రాల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో పటాన్చెరు పట్టణంలో నూతనంగా కొలువు దీరుతున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గంతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
పటాన్చెరులో శనివారం ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పర్యటిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం పాశమైలారంలో ఎమ్మెల్యే మంత్రి శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని పరిశీలించి, కాంట్రాక్టర్‌కు అధికారులకు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాలకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హాజరుకానున్నారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రోడ్డు నిర్మాణం..
పాశమైలారం ఐడీఏ నుంచి కర్ధనూర్ రింగురోడ్డు జంక్షన్ వరకు వేస్తున్న నాలుగులైన్ల రహదారితో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడుతుంది. మంత్రి హరీశ్‌రావు శనివారం రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేస్తారు. రూ.121.2 కోట్లతో రోడ్డు నిర్మాణం జరుగుతున్నది. అందులో రూ.76.2 కోట్లు భూములు, ప్లాట్లు నష్టపోతున్నవారికి అధికారులు అందజేశారు. కేవలం పరిశ్రమల ఉత్పత్తులు వేగవంతం కావాలనే లక్ష్యంతోనే తెలంగాణ సర్కార్ ఖర్చుకు వెనుకాడకుండా రోడ్డును వేస్తున్నది. వేలాది మందికి ఉపాధి కల్పించేందుకు రోడ్లు కూడా ముఖ్యమేనని గుర్తించి సీఎం కేసీఆర్ ద్వారా ఈ రోడ్డును మంజూరు చేయించుకున్నాం. గతంలో మంత్రి కేటీఆర్ పాశమైలారంలో పారిశ్రామివేత్తలకు ఈ రోడ్డు వేయిస్తానని హామీనిచ్చారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ చొరవతో రోడ్డుకు నిధులు వచ్చాయి.
పనులు ప్రారంభం అవుతున్నాయి.
– గూడెం మహిపాల్‌రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే
అందరి సహకారంతోనే సాధ్యమైంది..
అందరి సహకారంతోనే ఈరోడ్డు మంజురైంది. పాశమైలారానికి కార్మికులు రావాలంటే జంకే పరిస్థితి. మంత్రి కేటీఆర్‌ని కలిసి పాశమైలారం నుంచి కర్థనూర్ వరకు ప్రత్యేక రోడ్డు కావాలని కోరాం. తక్షణం స్పందించిన మంత్రి ప్రభుత్వ జీవో ఇప్పించారు. మధ్యలో కొందరు భూములు పోతున్నాయని కోర్టుకు వెళ్లడంతో అవాంతరాలు ఏర్పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు తీవ్రంగా శ్రమించి రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేసేలా కృషి చేశారు. మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన పనులు చేస్తుండటం ఆనందాన్ని కల్గిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వ సహకారం అద్భుతంగా ఉంది.
– చందుకుమార్ పొట్టి, పారిశ్రామికవేత్త, సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్