పెద్ద శంకరంపేట, సెప్టెంబర్ 9: సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేస్తూ దినదినాభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేటలోని తిర్మలాపురం చెరువులో జిల్లా మత్స్యశాఖ అధికారి రజనితో కలిసి 75 వేల చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని చెరువుల్లో, కుంటల్లో చేపపిల్లలు పెంచేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారన్నారు. చేపల పెంపకంతో మత్స్య కార్మికులకు ఉపాధి లభిస్తున్నదన్నారు. సమైక్య రాష్ట్రంలో కులవృత్తులను నిర్వీర్యం చేశారని, దీంతో వలసలు పెరిగాయని అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కులవృత్తుల పూర్వ వైభవానికి కృషి చేస్తున్నారన్నారు. వందశాతం సబ్సిడీతో చేపపిల్లలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీ పంతులు, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేశ్, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ,ఎంపీటీసీ వీణా సుభాశ్‌గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, తదితరులున్నారు
కల్హేర్‌లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
బలహీన వర్గాల అభ్యున్నతికీ, సామాజిక న్యాయం కోసం ఉద్యమించిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే అని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కొనియాడారు. శుక్రవారం సిర్గాపూర్ మండల తెలంగాణ మహాత్మ జ్యోతిరావు ఫూలే గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వచ్ఛ గురుకులం కార్యక్రమంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తర్వాత పాఠశాలలో మొక్కలు నాటారు. అనంతరం బాచేపల్లి, నాగదర్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలు అందజేశారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యబోధనపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించి నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నర్సింహరెడ్డి, ఎంపీపీ మైపాల్‌రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు దుర్గారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సంగారెడ్డి, నాగదర్ సర్పంచ్ రవీలా, మాజీ మండల అధ్యక్షుడు పద్మ బాపిరాజు, మాజీ ఎంపీటీసీ కృష్ణాగౌడ్, నాగదర్ ఉప సర్పంచ్ అడివప్ప, నాయకులు అంజిరెడ్డి, వెంకటేశం గుప్త, భూపాల్ పాల్గొన్నారు.