సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 9: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు సంగారెడ్డి జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ రమణకుమార్తో కలిసి ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు వజ్రోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించేలా చూడాలన్నారు.
16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కనీసం 15 వేల మందితో జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ, సంబంధిత ఎమ్మెల్యేల నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించాలన్నారు. ర్యాలీ అనంతరం బహిరంగ సభ, భోజన వసతికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. 17న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగురవేయాలన్నారు. జిల్లాలోని గిరిజన తెగలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులను హైదరాబాద్‌కు ప్రత్యేక వాహనాల్లో తరలించాలని సూచించారు. 18న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ రమణకుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
నర్సాపూర్, సెప్టెంబర్ 9: తెలంగాణ వజ్రోత్సవాలను అట్టహాసంగా జరుపుతామని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ శివారులోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాలను శుక్రవారం సందర్శించి ఏర్పాట్లకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత దేశంలో తెలంగాణ భాగస్వామ్యమై 75 ఏండ్లు అయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 16న నర్సాపూర్‌లోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాలలో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, ఏఎమ్‌సీ డైరెక్టర్ సాగర్, టీఆర్ఎస్ నాయకులు శ్రీధర్‌గుప్తా, అశోక్‌గౌడ్ పాల్గొన్నారు.