సంగారెడ్డి అర్బన్, సెప్టెంబర్ 7 : ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం సంగారెడ్డిలో జరిగింది. రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్కు చెందిన మేఘకపూర్ (22) సంగారెడ్డి జిల్లా కేంద్ర పరిధిలోని ఐఐటీ హైదరాబాద్లో బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. కొద్ది రోజులుగా క్యాంపస్ బయట సంగారెడ్డిలోని ఓ లాడ్జిలో అద్దెకుంటూ ఎంటెక్కు ప్రిపేర్ అవుతున్నాడు. బుధవారం తెల్లవారుజామున తాను ఉంటున్న లాడ్జి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి తల్లిదండ్రులు జోధ్పూర్ నుంచి బయలుదేరారని, గురువారం ఉదయం వరకు సంగారెడ్డి చేరుకుంటారని డీఎస్పీ రవీంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థి ఆత్మహత్యకు ముందు తల్లిదండ్రులతో మాట్లాడా..? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న విషయా లు తల్లిదండ్రులు వచ్చాకే తెలుస్తున్నదన్నారు. లాడ్జి గదికి తాళం వేయించామని, కుటుంబ సభ్యుల సమక్షంలోనే గదిని తెరిచి మృతికి గల కారణాలను తెలియజేస్తామని డీఎస్పీ తెలిపారు.
వారం రోజుల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య
వారం రోజుల్లో ఐఐటీ హైదరాబాద్కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం కలకలం రేపుతుంది. ఆగస్టు 30న రాహుల్ అనే విద్యార్థి హాస్టల్ రూంలో మంచానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మరువకముందే వారం రోజుల్లో విద్యార్థి మేఘకపూర్ ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.