రామాయంపేట, సెప్టెంబర్ 6 : గర్భిణుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరావు అన్నారు. మంగళవారం రెం డు రోజుల శిక్షణ కోసం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు ఢిల్లీ వైద్య బృందం చేరుకుంది. ఈ బృందం మహిళలు ప్రసూతి సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ‘మిరా’ పేరుతో అధ్యయనాన్ని చేపట్టిందన్నారు. ప్రభుత్వం ఈ పద్ధతిని రాష్ట్రంలోని అన్ని సబ్సెంటర్లలో త్వరలో అమలు చేస్తుందన్నారు. గర్భిణుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ విధానంతో మహిళల్లో రక్తహీనత, జెస్టేషనల్, డయాబెటిస్, గర్భధారణ, ప్రేరేపిత రక్తపోటుకు సరైన టైంలో వైద్యం అందుతుందన్నారు. ప్రస్తుతం మెదక్, రామాయంపేట, సిద్దిపేట జిల్లాలో ఐదు మండలాలు, వికారాబాద్, యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి జిల్లాలను ముందుగా ఎంపిక చేశామన్నారు. వారి వెంట పీవో ఎంసీహెచ్ డాక్టర్ సుమిత్ర, శైలేశ్ మోహన్, డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్, ఝురియన్, డాక్టర్ కల్పన, బసాని, అపరాజిత, రాధాకృష్ణంరాజు, శాస్త్రవేత్త రమ్య, రామాయంపేట ప్రభుత్వ డాక్టర్ సుకేసిని ఉన్నారు.
ఊరూరా జ్వర సర్వే
డెంగీ కేసులు పెరుగుతున్నాయని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. మంగళవారం రామాయంపేట ప్రభుత్వ దవాఖాన పరిసరాలను పరిశీలించి, స్వీపర్లు, అటెండర్లకు అవగాహన కల్పించారు. టైగర్ మస్కిటో అవసరం ఉన్నపుడే కడుపు నింపుకునేందుకు బయటకు వస్తున్నదన్నారు. డెంగీ లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే దగ్గరలో ఉన్న పీహెచ్సీలకు వెళ్తే తగ్గిపోతుందన్నారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా జ్వర సర్వే చేపడుతామన్నారు.