నివారణపై ప్రజలను చైతన్యం చేయాలి
బూస్టర్ డోస్ వందశాతం వేయాలి
విద్యార్థినులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
సంగారెడ్డి కలెక్టర్ శరత్
జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్లో పర్యటన
గురుకుల పాఠశాల, పీహెచ్సీ తనిఖీ
న్యాల్కల్ రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు
కోహీర్, సెప్టెంబర్ 6 : వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. మంగళవారం మండలంలోని దిగ్వాల్ ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా దవాఖానకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. దవాఖానలో 83 శాతం ప్రసవాలను చేసినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. డెంగీపై అప్రమత్తంగా ఉండాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. వ్యాధుల నివారణకు ఎప్పటికప్పుడూ ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ప్రజలకు బూస్టర్ డోస్ వందశాతం వేయాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రాజ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బాలికలు సంతోషంగా చదువుకోవాలి
జహీరాబాద్, సెప్టెంబర్ 6: ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో బాలికలందరూ సంతోషంగా చదువుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ కోరారు. మంగళవారం రంజోల్ గ్రామంలోని గురుకుల పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కష్టపడి చదివి భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. గురుకుల పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా కనిపించడంతో ప్రిన్సిపాల్ కృష్ణవేణి పనితీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రమేశ్‌బాబు, తహసీల్దార్ నాగేశ్వర్రావు ఉన్నారు.
అధికారులతో సమీక్ష
న్యాల్కల్, సెప్టెంబర్ 6 : రేజింతల్ సిద్ధి వినాయక ఆలయాన్ని మంగళవారం రాత్రి సంగారెడ్డి కలెక్టర్ శరత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 13న ఆలయంలో నిర్వహించే అంగరక సంకష్టహార చతుర్థి వేడుకలకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హారీశ్‌రావు హాజరుకానున్నారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. ఇటీవల ఆల య అభివృద్ధికి మంత్రి మంజూరు చేసిన రూ.50 లక్షలతో చేపట్టిన పనులను పరిశీలించారు. పనులన్నీ వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. మిర్జాపూర్(బి) గ్రామంలోని వివాదాస్పద స్థలం జడ్పీ పాఠశాల సమీపంలోని సర్వే నంబర్ 3లో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని సర్పంచ్ విజయలక్ష్మి, హద్నూర్ పీఏసీఎస్ చైర్మన్ జగన్నాథ్‌రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్థలాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో రమేశ్‌బాబును ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రమేశ్‌బాబు, మండల అధికారులు షాభానాబీ, రాఘవరావు, సుమతి, నాగభూషణం, కృష్ణ డావుద్, దుర్గయ్య, రేజింతల్ సర్పంచ్ కుత్బోద్దీన్, విజయలక్ష్మి, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆశోక్, ఆలయ కమిటీ సభ్యులు వీరేశం, కల్వ చంద్రశేఖర్, మేనేజర్ కృష్ణ, హద్నూర్ ఎస్సై వినయ్‌కుమార్ ఉన్నారు.