సిద్దిపేట, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. వారి ఆర్థిక, సామాజికాభివృద్ధికి దళితబంధు పథకాన్ని తెచ్చారు. ఈ పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక అసమానతలు తొలగించేందుకు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ ఆ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచేలా చేశారు. ప్రభుత్వం అందించిన పథకాలతో తామంతా బాగుపడి, తమ కాళ్ల మీద తాము నిలబడి.. మరో పది మందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదుగుతున్నారు. ప్రభుత్వం అందించిన సాయం వారి జీవన విధానాన్ని మార్చేసింది. దళితుల రక్షణ కోసం దళితనిధిని సైతం తీసుకొచ్చింది. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,194 కుటుంబాలకు దళితబంధును రాష్ట్ర ప్రభుత్వం అందించింది. తాజాగా ప్రతి నియోజకవర్గానికి 1500 చొప్పున దళిత కుటుంబాలకు ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి రూ. 10లక్షల చొప్పున ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మొన్నటి కేబినెట్ సమావేశంలో ఆమోదం కూడా తెలిపారు. తొలుత ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున ఇవ్వనున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 11 నియోజకవర్గాలు, జనగామ, మానకొండూరు కలుపుకొని మొత్తంగా 5,600 కుటుంబాలకు అందనున్నది. దీంతో ఆ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో1,194 కుటుంబాలకు..
మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో దళితబంధుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2022-23 బడ్జెట్లో సైతం భారీగా నిధులను కేటాయించారు. ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో తొలి విడతలో వంద మంది లబ్ధిదారులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ.10లక్షల సాయం అందించింది. దీంతో లబ్ధిదారులు 60కి పైగా వివిధ రకాల యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లాలో 495 కుటుంబాలకు రూ.45.50 కోట్లు, మెదక్ జిల్లాలో 255 కుటుంబాలకు రూ.25.50 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 444 కుటుంబాలకు రూ.44.40 కోట్లు అందించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,194 కుటుంబాలకు రూ 115.40 కోట్లు అందాయి. ప్రభుత్వ సాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారు.
మొదట నియోజకవర్గానికి 500 కుటుంబాలకు..
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి నియోజకవర్గానికి 1500 మందికి దళితబంధు వర్తించనున్నది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్చెరు నియోజకవర్గాలతో పాటు సిద్దిపేట జిల్లాలో జనగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలం ఉన్నాయి. 11 నియోజకవర్గాలకు లెక్క వేసుకున్నా మొత్తం 16,500 మంది లబ్ధిదారులు అవుతారు. మిగతా మండలాలకు కలిపి మరో వంద లెక్క వేసుకున్నా మొత్తంగా సరాసరి 16,600 కుటుంబాలకు దశల వారీగా అందనున్నది. తొలి విడతగా ప్రతి నియోజకవర్గానికి 500 మందికి అందజేస్తారు. 11నియోజకవర్గాలతో పాటు జనగామ నియోజకవర్గాన్ని కలుపుకొని మొత్తంగా 5,600 కుటుంబాలకు తొలి విడత ఫలాలు అందుతాయి. ఇందుకు రూ. 560 కోట్లు అవసరం పడుతాయి. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో నిధులు కేటాయించడంతో ఆ దిశగా దళితబంధును జిల్లాలో పక్కాగా అమలు చేయడానికి మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి కసరత్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ దళిత కుటుంబాల అభ్యున్నతికి తీసుకున్న నిర్ణయంపై ఆ కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.