సిద్దిపేట, సెప్టెంబర్ 5 : ప్రముఖ కంపెనీ ఎల్అండ్టీ సహకారంతో సిద్దిపేటలో నిరుద్యోగ యువకుల కోసం శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేటలోని డబుల్ బెడ్రూం కేసీఆర్‌నగర్‌లో ఎల్అండ్టీ నిరుద్యోగ యువకుల కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఎల్అండ్టీ దేశంలోనే ఎంతో పేరుగాంచిన కంపెనీ అన్నారు. వారి సహకారంతో సిద్దిపేట నియోజకవర్గ యువకులకు వృత్తి నైపుణ్యతపై శిక్షణ ఇచ్చి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారందరికీ ఆ కంపెనీలో ఉపాధి అవకాశం కల్పిస్తున్నదని చెప్పారు. శిక్షణ పొంది సర్టిఫికెట్ ఉన్న వారు దేశ విదేశాల్లో ఉపాధి పొందేందుకు అర్హులన్నారు.
ఐదో తరగతి నుంచి ఆపై చదువుకున్న వారు 18-35 ఏండ్ల వయస్సు వారు ఇందుకు అర్హులన్నారు. ఐటీఐ చదువుకున్న వారికి మంచి అవకాశాలు కల్పించనున్నారన్నారు. ఇందులో కార్పెంటర్, సెంట్రింగ్, మేస్త్రీ, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, శానిటరీ లాంటి వాటిలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 15వ తేదీ వరకు సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.