సీఎం కేసీఆర్ చలవతోనే కరువు ప్రాంతం జనగామకు గోదావరి జలాలు వచ్చాయని స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మల్లన్నసాగర్ ఇంటెక్వెల్ టు తపాస్‌పల్లి రిజర్వాయర్ వరకు రూ.388 కోట్లతో నిర్మించే భూగర్భ జలమార్గం, ఓపెన్ కెనాల్ పనులను సోమవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నియోజకర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, రైతులు పరిశీలించారు. అనంతరం మల్లన్నసాగర్ టు తపాస్‌పల్లి ఇంటెక్వెల్ వద్ద ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు.
చేర్యాల, సెప్టెంబర్ 5 : సీఎం కేసీఆర్ చొరవతో నిత్య కరువు ప్రాంతమైన జనగామ నియోజకవర్గంలో గోదారమ్మ పరుగులు పెడుతున్నదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ఇన్‌టెక్ వెల్ టు తపాస్‌పల్లి రిజర్వాయర్ వరకు రూ.388 కోట్లతో నిర్మించే భూగర్భ జలమార్గం, ఓపెన్ కెనాల్ పనులను సోమవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పరిశీలించారు. కెనాల్ నిర్మాణంతో భూమి కోల్పోతున్న రైతులు స్వయంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మిఠాయిలు తినిపించి, జై కేసీఆర్.. జై టీఆర్ఎస్.. అని నినాదాలు చేశారు.
అనంతరం మల్లన్నసాగర్ టూ తపాస్‌పల్లి ఇన్‌టెక్ వెల్ వద్ద ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పుష్పాభిషేకం చేశారు. తపాస్‌పల్లికి జలాలు వచ్చే అండర్‌గ్రౌండ్ టన్నెల్ పనులు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా తపాస్పల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ర్టాల రైతులు సీఎం కేసీఆర్‌ను దేశం కోసం ముందుకొచ్చి, నాయకత్వం వహించాలని స్వాగతిస్తున్నారని, దేశాభివృద్ధి కోసం తప్పక నాయకత్వం వహించాలని కోరారు. కరువు ఉన్న చోటే రిజర్వాయర్లు నిర్మిస్తున్న సీఎం కేసీఆర్ ముందుచూపు, మేధోశక్తిని చూసి భారత రైతాంగం అబ్బురపడుతున్నదని, దీంతో బీజేపీ నేతల్లో వణుకు మొదలైందన్నారు.
నిత్య కరువు ప్రాంతమైన జనగామ ప్రజలకు సాగు నీరు, తాగు నీరు అందించేందుకు సీఎం కేసీఆర్ రూ.388కోట్లు మంజూరు చేయడంతో పాటు పనులు సైతం ప్రారంభించినట్లు తెలిపారు. తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్ చేసేందుకు 640 ఎకరాల భూమి అవసరమైందని, అందులో ఎక్కువ భాగం గజ్వేల్ నియోజకర్గంలో ఉందని, రైతులు ఎక్కువగా భూమి కోల్పోకుండా ఉండేందుకు భూగర్భంలోనే టన్నెళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. మల్లన్నసాగర్-తపాస్‌పల్లి లింకేజీతో నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో గోదావరి జలాలు అందడంతో పాటు గజ్వేల్, సిద్దిపేట, ఆలేరు, భువనగిరి, మేడ్చల్ నియోజకవర్గాలకు సైతం కొంతమేరకు సాగు, తాగు నీరు అందించనున్నట్లు పేర్కొన్నారు.
తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీరు రానుండడంతో ఇక దేవాదుల నుంచి వచ్చే నీటిని జనగామ జిల్లా నర్మెట్ట, తరిగొప్పుల రైతుల అవసరాల మేరకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఐదున్నర కిలోమీటర్ల మేరకు 20మీటర్ల డయాతో అండర్‌గ్రౌండ్ కాల్వల నిర్మాణంతో పాటు తపాస్‌పల్లి సమీపంలో కిలోమీటర్ మేరకు ఓపెన్ కెనాల్ నిర్మించనున్నట్లు తెలిపారు. ఆరు నియోజకవర్గాలకు ఉపయోగపడేలా సీఎం కేసీఆర్ డిజైన్ చేశారని, నదిని రివర్స్‌లో పారిస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు.
నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయించేందుకు సర్కారు అన్ని చర్యలు తీసుకుంటున్నదని, నిత్యం పనికిమాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష పార్టీలు ఇక్కడికి వచ్చి, ఏమి జరుగుతుందో చూసి మాట్లాడితే బాగుంటుందన్నారు. తపాస్‌పల్లికి గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు ఏటా ఏడుగురు ఎమ్మెల్యే(హుస్నాబాద్, పాలకుర్తి, స్టేషన్ఘనపూర్, ఆలేరు, భూపాల్పల్లి, పరకాల, వర్ధన్నపేట)లను కొంతమేరకు తిప్పలు పెట్టేవాడినని, తనను వారు క్షమించాలన్నారు.
జనగామ నియోజవకర్గం సస్యశ్యామలం అయ్యేందుకు నిధులు మంజూరు చేసి, పనులకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గుజ్జ సంపత్‌రెడ్డి, ఎంపీపీలు బద్దిపడిగె కృష్ణారెడ్డి, వుల్లంపల్లి కరుణాకర్, తలారీ కీర్తనాకిషన్, జడ్పీటీసీలు మల్లేశం, సిద్ధప్ప, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశంగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వరూపరాణి, వైస్ చైర్మన్ రాజీవ్‌రెడ్డి, మల్లన్న ఆలయ మాజీ చైర్మన్ గీస భిక్షపతి, మండలాల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, మేక సంతోష్, మంద యాదగిరి, టౌన్ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్రావు, రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీలు, యూత్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే చేర్యాలలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పూలమాల వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు.