మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 29: హాకీలో దేశానికే వన్నె తెచ్చిన మహనీయుడు ధ్యాన్‌చంద్.. పట్టుదల దీక్షతో ముందుకెళ్తే ఏ రంగంలోనైనా రాణిస్తారని, ప్రతీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అన్నారు. సోమవారం పెట్స్ క్లబ్, పీఈటీ అసోసియేషన్, జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎక్స్ రోడ్ నుంచి యువకులకు 4కే రన్, బస్సు డిపో వద్ద నుంచి బాలికలకు 2కే రన్‌ను మున్సిపల్ చైర్మన్, డీఎస్వో నాగరాజు, పెట్స్ క్లబ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, శ్రీనివాస్‌రావు, జిల్లా అథ్లెటిక్స్ ఆసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మధుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ధ్యాన్‌చంద్ చౌరస్తాలోని ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఆరోగ్యకర జీవితానికి, శారీరక, మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి క్రీడలు దోహదపడుతాయన్నారు.ప్రభుత్వం విద్యతోపాటు క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ భారీ నిధులు కేటాయిస్తున్నదన్నారు. క్రీడాకారులు అంకితభావంతో ముందుకెళ్లాలన్నారు. క్రీడలకు ధనిక, పేద అనే తేడా ఉండదన్నారు. క్రీడాకారులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. జిల్లా కేంద్రంలో పెట్స్ క్లబ్‌కు స్థలంతోపాటు భవన నిర్మాణానికి సహకరిస్తానన్నారు. క్రికెట్ మైదానం కోసం పిల్లికోటల్ వద్ద ఎమ్మెల్యే సహకారంలో 6 ఎకరాల స్థలాన్ని గుర్తించామన్నారు.
ఈ నెల 24, 25 తేదీల్లో మెదక్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు విజయవంతంగా నిర్వహించిన పీఈటీలకు చంద్రపాల్ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు జిల్లా యువజన, క్రీడాలధికారి నాగరాజు మాట్లాడుతూ మెదక్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. 16 ఏండ్ల నుంచి జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మెదక్‌లో 4కే, 2కే రన్ నిర్వహిస్తున్నామన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన పెట్స్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ పెట్స్ క్లబ్‌కు స్థలం, భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
త్వరలోనే స్థలంతో పాటు భవన నిర్మాణానికి నిధులు కేటాయించి సహకారం అం దిస్తానని తెలిపారని, ఈ విషయంలో మున్సిపల్ చైర్మన్ సహకరించాలని పేర్కొన్నారు. జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యుడు జుబేర్ మాట్లాడుతూ ధ్యాన్‌చంద్ చౌరస్తాలో సుందరీకరణలో భాగంగా తొలిగించిన ధ్యాన్‌చంద్ విగ్రహాన్ని తొందరగా పున:ప్రతిష్ఠించాలని ప్రజాప్రతినిధులను కోరారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్‌రావు, మాధవరెడ్డి, దేవేందర్‌రెడ్డి, మహిపాల్, రాజేందర్, స్పోర్ట్ ఫౌండేషన్ సభ్యులు నందిని శ్రీను, మొహిజ్ పాల్గొన్నారు.
విజేతలకు ట్రాక్‌షూట్ అందజేత..
4కే రన్ బాలుర విభాగంలో ఔరంగబాద్‌కు చెందిన సంజీవ్ ప్రథమ స్థానంలో నిలువగా, రెండో స్థానంలో అర్జున్, మూడో స్థానంలో ముజంబిల్, నాలుగో స్థానంలో రమేశ్, ఐదో స్థానంలో శ్రీకాంత్‌రెడ్డి నిలిచారు. 2కే రన్ బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో ప్రియాంక, రెండో స్థానంలో నందిని, మూడో స్థానంలో దివ్య, నాలుగో స్థానంలో హరిక, ఐదో స్థానంలో దివ్యశ్రీ నిలిచారు. వీరికి పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి కృష్ణ సౌజన్యంతో ట్రాక్షూట్ను అందజేశారు.