దళిత వర్గంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మరోమారు విషం కక్కాడు. నాడు ‘బాడుగ నేతలు’ అని కించపర్చగా, నేడు ‘దళితబంధు ఎందుకు’? అని వ్యాఖ్యానించాడు. ఏబీఎన్ బిగ్ డిబెట్లో దళితబంధును వ్యతిరేకిం చడమే కాకుండా పథకంపై ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఉచితాలు ఎందుకు? ఒక కుటుంబానికి ఎలా రూ.పది లక్షలు ఇస్తారు? అంటూ తన కుసంస్కారాన్ని బయటపెట్టాడు. అది సంక్షేమ పథకమని ఎమ్మెల్సీ కవిత ఎంత వారించినా, వినకుండా ఆయన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. ఆయన వ్యాఖ్యలపై ఆ వర్గం మండిపడుతోంది. అతనికి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తోంది. మొదటి నుంచి రాధాకృష్ణ దళితులపై వ్యతిరేక భావజాలంతో ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తాము పథకంతో లబ్ధిపొందుతూ మరో పది మందికి ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొంటున్నది. తాము ఎలా బాగు పడుతున్నామో వచ్చి చూడాలని సూచిస్తున్నది.
సిద్దిపేట, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఉద్యమంలో వక్రబుద్ధి చూపిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా ఆయన తన పత్రికలో ఎప్పుడూ ద్వేషం కక్కుతూనే ఉంటాడు. తెలంగాణ మీద, టీఆర్ఎస్ సర్కారు మీద ఎప్పుడూ తన మీడియాలో నెగెటీవ్గానే స్పందిస్తుండడం ప్రజలందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలంగాణ సమాజం ఇంటి పత్రిక ‘నమస్తే తెలంగాణ’పై విషం కక్కుడే ఆయన పనిగా పెట్టుకున్నారు.
ఏబీఎన్ బిగ్ డిబెట్లో దళితబంధును వ్యతిరేకించడమే కాకుండా దళితబంధు పథకంపై ఆయన ఇష్టానుసారంగా మాట్లాడడంపై ఆ వర్గాలు భగ్గుమంటున్నాయి. సంక్షేమ పథకాలు, ఉచితాలు ఎందుకు? ఒక కుటుంబానికి ఎలా రూ.పది లక్షలు ఇస్తారు? అంటూ తన కుసంస్కారాన్ని బయట పెట్టుకున్నారు. ఉచితాలకు ఓట్లు రాలుతాయా? అంటూ తన అక్కసును వెళ్లగక్కుతున్నాడు. అడ్డదిడ్డ వార్తలతో ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా ఇష్టానుసారంగా తన పత్రికల్లో రాసుకుంటూ, చానల్లో ప్రసారం చేయడంపై ఆ వర్గాలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవు.. ఇక్కడ అన్నివర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలు, మరే ఇతర రాష్ర్టాల్లో గానీ ఇలాంటి పథకాలు ఉన్నాయా అంటే? ఎక్కడా లేవు. ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు తెలియదా? అన్నీ తెలిసి కూడా మరీ ఆయన ఎలా మాట్లాడతారు.. అంటూ దళిత వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
ఉచితాల గురించి మాట్లాడడం ఏమిటీ? పేద ప్రజలకు సంక్షేమ పథకాలు వద్దా? పేద ప్రజల బాగుపడవద్ద్దా? ఎందుకు మీకు పేద ప్రజలపై అంత మంట? అంటూ ప్రజలు ఆయన తీరుపై మండిపడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికి కోసం దళితబంధు పథకం తీసుకొస్తే, దానికి ఆయన వంకరబుద్ధితో మాట్లాడడంపై ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా దళితులను ఓటుబ్యాంకుగానే వాడుకున్నారు. దేశాన్ని ఇన్నేండ్లు ఏలిన రాజకీయ పార్టీలు వారి సంక్షేమానికి ఆశించిన స్థాయిలో కృషిచేయలేదు. అందువల్లనే దేశంలో దళితులు ఇప్పటికే ఆర్థిక, సామాజిక రంగాల్లో వెనకబడి ఉన్నారు. వారి తరతరాల తలరాతను మార్చేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టారు. ఇవాళ దేశానికి ఆదర్శంగా ఈ పథకం నిలిచింది. దళితబంధు పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి రూ.10 లక్షల ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది. ఇది పూర్తిగా గ్రాంట్. తిరిగి లబ్ధిదారులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. తొలి విడతగా సిద్దిపేట జిల్లాలో 495 మంది లబ్ధిదారులకు రూ.45.50 కోట్లతో 60 రకాల యూనిట్లను ప్రభుత్వం అందించి, ఆ కుటుంబాల్లో వెలుగులు నింపింది. మెదక్ జిల్లాలో 255 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకం అందివ్వగా, ఇక్కడ రూ.25.50 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 444మందికి రూ.44.40 కోట్లు అందించింది. ప్రభుత్వం అందించిన సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. లబ్ధిదారుల రక్షణ కోసం దళితనిధిని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన దళితబంధు పథకం ద్వారా లబ్ధిపొందిన కుటుంబాలు ఇవాళ సొంతకాళ్ల మీద నిలబడి, మరో పది మందికి ఉపాధిని చూపిస్తున్నాయి. ఈ పథకం దళితుల ఆర్థికాభివృద్ధితో పాటు ఆర్థిక, సామాజిక అసమానతలు తగ్గించడానికి దోహదపడుతున్నది. ప్రభుత్వం అందించిన ఈ పథకంతో తామంతా బాగుపడి, తమ కాళ్ల మీద తాము నిలబడి.. మరో పది మందికి ఉపాధినిచ్చేలా ఎదుగుతున్నారు. దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేశానికే స్ఫూర్తిని నింపుతున్నారు. ప్రభుత్వం అందించిన చేయూత దళితబంధు లబ్ధిదారుల జీవన విధానాన్ని మార్చేసింది.

సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి దళితుల కష్టాలను స్వయంగా పరిశీలించి వారిని సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో దళితబంధు ప్రవేశపెట్టారు. రూ. లక్ష కోసం ఉమ్మడి రాష్ట్రంలో దళితు లు కార్యాలయాల చుట్టూ తిరిగే వారు. నాటి సర్కారు తీరా లక్ష మంజూరు చేసే వరకు వం దల కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రాని తిరిగితిరిగి, వేలాది రూపాయలు అప్పులు చేసేవారు. వచ్చిన లక్షతో అప్పులు తీర్చుకోలేక వ్యాపారం చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుతో రూ.10లక్షలు రావడంతో వారికి ఎంతో మేలు కలుగుతున్నది. రూ.పది లక్షలు రావడంతో వ్యాపారం చేసుకుంటే, వారితో పాటు మరో 10 మంది దళితులు బాగుపడుతున్నారు. దళితులకు ఎంతో ఉపయోగ పథకంపై కామెంట్లు చేసి రాధాకృష్ణ తన అగ్రకుల బుద్ధిని బయపెట్టుకున్నారు.
– ముస్త్యాల బాల్‌నర్సయ్య, అర్అండ్బీ రిటైర్డ్ ఈఈ, చేర్యాల
దళితులను కించపర్చేలా చేసిన వ్యాఖ్యలను రాధాకృష్ణ వెంటనే ఉపసంహరించుకొని, దళిత జాతికి వెంటనే క్షమాపణ చెప్పాలి. మరోసారి దళితుల జోలికి వస్తే పుట్టగతులుండవు. దళితుల అభ్యున్నతి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధును ప్రవేశపెట్టారు. దళితబంధు ద్వారా దళితులు అభివృద్ధి చెందుతుంటే ఆర్కే జీర్ణించుకోవడం లేదు. పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తే కూడా ఓర్చుకోలేకపోతున్నాడు.
– మంద యాదగిరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, ధూళిమిట్ట
గతంలో దళితులను ఓట్ల కోసమే వాడుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ దళితుల పక్షాన ఆలోచన చేసి వాళ్ల్లు ఆర్థికాభివృద్ధి సాధించేలా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. దళితుల ఎదుగుదల ఓర్వలేని ఆర్కే, తన బుద్ధ్దిని ప్రదర్శించుండు. బీజేపీ తొత్తుగా మారిన ఆయన, దళితుల ఆర్థికాభివృద్ధికి అడ్డుపడుతే మాత్రం తరిమికొడుతాం.
దళితబంధు పథకాన్ని కొందరు ఓర్వలేకే అసత్యాలు మాట్లాడుతున్నారు. తప్పుదోవ పట్టించడం సరైంది కాదు. దళితుల జీవనోపాధికి దళితబంధు ఎంతో ఉపయోగపడుతుందో సరిగ్గా తెలుసుకొని మాట్లాడితే అర్థముంటుంది. చాలా కుటుంబాలు బాగుపడుతున్నాయన్న విషయాన్ని జీర్ణించుకోలేకనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పని పెట్టుకున్నారు. దుబ్బాక మండలం ఆరెపల్లిలో దళితబంధుతో ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఎక్కడో కూర్చుండి మాట్లాడటం కాదు. సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచనతో దళితుల అభివృద్ధికి ఈ పథకం తెచ్చినాడు. ఇది సరైన మార్గంలోనే పోతోంది.
– చెక్కపల్లి పద్మయ్య,
బాబూ జగ్జీవన్‌రామ్ సంఘం నాయకుడు, దుబ్బాక
అనాదిగా వెనుకబడ్డ దళితుల సంక్షేమానికే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం పెట్టిండు. దీన్ని ఎవరూ విమర్శించినా తప్పులు పడుతారు. దళితుల దీనావస్థను చూసి ఎవరూ చేయని సాహసం ముఖ్యమంత్రి చేసిండు. చేసేటోళ్లను విమర్శించద్దు. ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధాని దళితుల అభివృద్ధి గురించి ఆలోచించలే. దళితుల అవస్థలు ఇండ్లళ్లకు వచ్చి చూస్తే తెలుస్తది. మనుసుల ఓటి పెట్టుకొని, మీదికి ఓటి మాట్లాడితే మంచిగుండది. దళితబంధు పథకాన్ని ఎవరూ విమర్శించినా ఊరుకోం.
– మంద మల్లయ్య, డ్రైవర్, కోహెడ
ఏండ్ల తరబడి దళితులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. అలాంటి వారికి సీఎం కేసీఆర్ దళితబంధు పథకంలో రూ.10 లక్షలు ఇచ్చి ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేస్తుంటే, నీకేం బాధ? రాధాకృష్ణ. మా దళిత జాతి ఎదగడం నీకు ఇష్టం లేదా..? ఎందుకు నీకు మా పై అంత అక్కసు. ఏబీఎన్ రాధాకృష్ణ ప్రధానికి వంత పాడడం బంద్ చేసుకుంటే మంచిది. మంచి పథకానికి ఇబ్బందులు పెట్టొద్దు.
– ర్యాకం శ్రీరాములు, మాల మహానాడు రాష్ట్ర కో-ఆర్డినేటర్
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మాటలు దళితులకు తీరని అన్యాయం చేసేలా ఉన్నాయి. ఇప్పటికే దళితులు అభివృద్ధిలో వెనుక బడ్డారని సీఎం కేసీఆర్ దళితుల కోసం ప్రత్యేకంగా దళితబంధు తెచ్చారు. నాలాంటి పేదలందరికో దళితబంధు ఆదుకుంటున్నది. ఇలాంటి పథకాన్ని రద్దు చేయమనడం దళితులను మరిన్ని కష్టాల్లోకి నెట్టివేయడమే. దళితబంధు ఉండాలి.. దళితులు బాగుపడాలి.. అని ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం.
– గడిపె కొమురయ్య, దళితబంధు లబ్దిదారుడు, హుస్నాబాద్
దళితులు ఆత్మాభిమానంతో బతకాలన్న గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధు ప్రారంభించారు. దానిపై రాధాకృష్ణ ఇష్టమొచ్చినట్లు మాట్లాడాటం అ త్యంత హేయం. రాధాకృష్ణ ఖబడ్దార్.. ఇష్టానుసారం అవాకులు, చెవాకులు పేలితే దళితసంఘాల నాయకు లు, దళిత యువకుల ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి ఆఫీ సు ముట్టడిస్తాం. దళితుల్లో ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే సహించేది లేదు.
– బయ్యారం ఇస్తారి, టీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ ఉపాధ్యక్షుడు
ఇయ్యాల కాదు.. మొదటి నుంచి రాధాకృష్ణ దళితులపై వ్యతిరేక భావజాలంతో ఉన్నాడు. గతంలో కూడా దళితులను కించపరిచిన అనేక సంఘటనలున్నాయి. మీడియా చేతిలో ఉందని ఆ నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా తప్పుడు కథనాలు రాస్తూ వచ్చాడు. ఓసారి దళితులను అవమాన పరిచే విధంగా చేస్తే, ఆఫీస్‌పై దాడులు జరిగాయి. నేడు తెలంగాణ ప్రభుత్వం దళితులు అన్నింటిలో అభివృద్ధి చెందాలనే ఆలోచన చేసి దళితులకు స్వయం ఉపాధి కల్పిస్తూ ఆర్థికంగా ఎదిగే విధంగా దళితబంధు పథకం చేపడితే ఇయ్యాల మళ్ల దళితులపై తన మనస్సులో ఉన్న విషాన్ని బయటకు కక్కాడు. ఏదో పార్టీ మెప్పు కోసం, తన లబ్ధి కోసం తాపత్రయపడుతున్నాడు. బద్నాం చేయడంలో ఆర్కేను మించినోళ్లు ఈ భూమి మీదనే లేరు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం ఆర్కే తీరు. రెండు, మూడు రోజుల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో దళితులను వ్యతిరేకించే రాధాకృష్ణ దిష్టిబొమ్మలు దహనం చేయడం ఖాయం.
– తొందూరు ఎల్లయ్య, అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి (దళితనేత), అక్కన్నపేట
తరతరాలుగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురైన దళితుల అభివృద్ధిని ఆంధ్రామీడియా చానళ్లు ఓర్వలేకపోతున్నాయి. సీఎం కేసీఆర్ అంబేద్కర్ బాటలో పయనిస్తూ దళితుల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా దళితబంధును అమలు చేస్తున్నారు. కూలీ నాలీ చేసుకుంటూ పొట్టపోసుకున్న ఎన్నో పేద కుటుంబాలు దళితబంధుతో ఓనర్లుగా, వ్యాపారులుగా మారి ఆర్థికంగా ఎదుగుతున్నారు. సీమాంధ్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో వెనుకబాటుకు గురైన మాలో ఆర్థిక విప్లవాన్ని తెచ్చిన పథకం దళితబంధు. సీఎం కేసీఆర్‌ను అభాసుపాలు చేయాలని చూస్తే, దళితులంతా వారిపై మరోసారి దాడి చేయాల్సి వస్తుంది. దళితులను అవమానిస్తే ఎలాంటి గుణపాఠం చెబుతారో వారికి గతంలో అనుభవముంది.
– పొన్నాల కుమార్ మాదిగ, తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు
దళితబంధుపై రాధాకృష్ణ మాటలు సరికావు. మాలాంటి నిరుపేద కుటుంబాలకు దళితబంధు వరంలా మారింది. దళితుల అభ్యున్నతి నచ్చని ఆర్కే, దళితబంధును వ్యతిరేకిస్తూ ప్రజలను తప్పిదోవ పట్టించేలా మాట్లాడం సమంజసం కాదు. నిరుపేద దళిత కుటుంబాలు అభివృద్ధి సాధించే గొప్ప అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.
– మౌర్య స్వరూప, మహిళ, బెజ్జంకి
మా దళితుల బాగు కోసం సీఎం కేసీఆర్ ఇంటింటికీ రూ.10 లక్షలు ఇస్తామన్న మాట ప్రకారం మా గ్రామంలో 71మందికి ఇచ్చారు. మా జీవితాల్లో ధైర్యం నింపిండు. నాకు ఇద్దరూ కొడుకులు. మా భర్త చనిపోయిండు. అప్పుడు రైతుబీమా అందించిన కేసీఆర్ సార్ మాకు మళ్లి దళితబంధు అందించిండు. నా కొడుకులకు ట్రాక్టర్ ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎవరో గా ఆంధ్రజ్యోతి టీవీలో రాధాకృష్ణం దళితబంధు గురించి తప్పుగా మాట్లాడిండంటా. అయినకు దళితులంటే చిన్న చూపేమో. మంచిని మంచి అని చెప్పాలే తప్పా, గిట్ల మాట్లాడిన రాధాకృష్ణం.. మా ఊరికి రా.. చూపిస్తాం.. దళితబంధుతో ఎంత సంతోషంగా ఉన్నారో?
– కావేటి శివరాజమ్మ, మహ్మద్‌షాపూర్, దౌల్తాబాద్ మండలం
దళితుల జీవితాల్లో వెలుగులు నింపి భావితరాలకు బంగారు బాట వేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధు అమలు చేస్తున్నారు. ఏబీఎన్ డిబేట్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవితతో దళితబంధుకు తాను పూర్తిగా వ్యతిరేకి అని ఆమెతో వాగ్వాదం చేయడం ఆయనకు తగదు. ఓ పత్రిక యజమాని అయి ఉండి, దళితుల మనోభావాలను కించేపరిచేలా మాట్లాడటం సరికాదు. సంస్కారం లేకుండా మాట్లాడిన రాధాకృష్ణ తీరు మార్చుకోకపోతే ఆంధ్రజ్యోతి ఆఫీస్‌ను ముట్టడిస్తాం. దళితబంధుపై వ్యతిరేకంగా మాట్లాడిన రాధాకృష్ణ దళితులందరికి క్షమాపణ చెప్పాలి.
– డప్పు శివరాజ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, దౌల్తాబాద్ మండలం

దళితబంధుకు నేను వ్యతిరేకినని మాట్లాడిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దళిత సమాజానికి క్షమాపణ చెప్పి, దళితుల మంచి కోసం తెచ్చిన దళితబంధు ఏ విధంగా ఉపయోగించుకోవాలని సలహాలు, సూచనలివ్వాలే తప్పా, డిబేట్లో కించపర్చేలా మాట్లాడడం విరమించుకోవాలి.
– బండారు లాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, దౌల్తాబాద్ మండలం