సిద్దిపేట అర్బన్, ఆగస్టు 28 : కండ్లు ఉండి చూడలేని కబోదుల లెక్క బీజేపీ నేతలు దుర్మార్గంగా అబద్ధాలు చెబుతున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో 2020-21 యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కమీషన్ చెక్కులను మహిళా స్వయం సంఘాలకు ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఇటీవల వరంగల్‌కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్‌షా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని.. వారి మాట ల్లో అర్థం లేదన్నారు. రాష్ట్రంలో గణనీయంగా మార్పు వచ్చిందని..కాళేశ్వరం నీళ్ల ద్వారా భూమికి బరువయ్యేంత పంట దిగుబడి పెరిగిందన్నారు. ఒకప్పుడు ఎండిన చెరువులు కనపడేవవి ఇప్పుడు నిండిన చెరువులు కనిపిస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ హయాంలో పింఛన్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేదని.. ఇప్పుడు వేల సంఖ్యలో ఇస్తున్నామన్నారు. నాడు కాంగ్రెస్ హయాంలో సిద్దిపేటలో 20 లక్షల మందికి రూ.200 చొప్పున పింఛన్లు ఉండేవని, నేడు తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో 54 వేల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఇది పేదల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని వివరించారు. నాడు సర్కారు దవాఖానల పరిస్థితి అధ్వానంగా ఉండేదని ఇప్పుడు ప్రైవేట్‌కు దీటుగా దవాఖానల్లో వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.
“అడగంది అమ్మైనా అన్నం పెట్టదు.. మిట్టపల్లి గ్రామ శివారులో మహిళా సమాఖ్య సంఘాలకు ఎదో ఒక సాయం చేయాలని.. అన్ని వసతులతో జిల్లా మహిళా సమాఖ్య భవనం, ఉమెన్ వర్కింగ్ హాస్టల్, మహిళా ప్రాంగణం కోసం 5 ఎకరాల స్థలం, భవన నిర్మాణానికి రూ.5 కోట్లు మం జూరు చేస్తున్నట్లు” మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. మూడింటికీ ఒకే చోట స్థల సేకరణ కోసం ఆర్డీవోకు ఆదేశాలు ఇచ్చానన్నారు. 20 ఏండ్ల క్రితం ఎక్కడో ఒక చోట కొనుగోలు కేంద్రం ఉండేదని.. ఇప్పుడు ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నా రు.
గోదావరి జలాల పుణ్యమా అని ఏటా 5.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తున్నదన్నారు. ఇది కాళేశ్వరం నీటి ద్వారా సాధ్యమైందని.. ఈ విషయాన్ని ప్రజలకు తెలిసేలా వివరంగా చెప్పాలని సూచించారు. హుస్నాబాద్‌లో 100, దుబ్బాకలో 100, గజ్వేల్‌లో 250 పడకల దవాఖానల్లో సేవలు అందుతున్నాయని, చేర్యాలలో రూ.10 కోట్లతో కొత్త దవాఖానకు నిధులు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. సిద్దిపేటలో కొత్తగా 900 పడకల దవాఖాన నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ పాల్గొన్నారు.