సిద్దిపేట, ఆగస్టు 28 : “తొలిదశ ఉద్యమంలో మంత్రి పదవికి కొండా లక్ష్మణ్ బాపూజీ రాజీనామా చేస్తే… మలిదశ ఉద్యమంలో మంత్రి పదవికి సీఎం కేసీఆర్ రాజీనామా చేశారని.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో హైదరాబాద్ రాష్ర్టాన్ని ఆంధ్రాలో కలుపొద్దని వ్యతిరేకించిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ” అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
సిద్దిపేట జిల్లా పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల రోడ్డులోని సుడా పార్కులో నెలకొల్పిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు రమణ, ఫారూఖ్‌హుస్సేన్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ బాపూజీ త్యాగాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. విలువలకు కట్టుబడిన వ్యక్తిగా జీవితాంతం బతికారన్నారు.
చాకలి ఐలమ్మ భర్తను న్యాయవాదిగా విడిపించారన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమనేత కేసీఆర్‌కు కొండా లక్ష్మణ్ అండగా ఉన్నారని, బాపూజీ కార్మికుల కోసం పనిచేశారని, ఈ విగ్రహం ఏర్పాటు మనందరి ఆత్మగౌరవ ప్రతీక అన్నారు. పద్మశాలీలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి బీమా వయస్సు సడలింపు ఆలోచన చేస్తామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నవి రద్దు చేసింది తప్పా ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో హ్యాండ్లూమ్ బోర్డు ఏర్పాటు చేస్తే ఇవాళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. హ్యాండి క్రాఫ్ట్ బోర్డు, పవర్ లూమ్ బోర్డు, త్రిఫ్ట్ పథకం కూడా రద్దు చేసిందని మంత్రి చెప్పుకొచ్చారు.
చేనేత వస్ర్తాల మీద జీఎస్టీ పెంచారని, చేనేత రంగంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు అన్ని అప్పులు మాఫీ చేసిందని, నేతన్నకు అండగా ఉన్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, రైతుబీమా తరహాలో చేనేత కార్మికులకు రూ.5 లక్షలు బీమా పథకం తెచ్చామన్నారు. రూ.600 కోట్ల బతుకమ్మ చీరెలకు ఆర్డర్ ఇచ్చామని, స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రూ.1.20 కోట్ల జాతీయ జెండాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చి చేనేతలకు అండగా నిలిచిందన్నారు.
హుస్నాబాద్ చేనేత కార్మికులకు కూడా ఎమ్మెల్యే సతీశ్‌తో మాట్లాడి సహాయం చేస్తామన్నారు. సిద్దిపేట నియోజకవర్గ చేనేత కార్మికులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీలు రమణ, పారూఖ్ హుస్సేన్, జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడారు.కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు, పద్మశాలీ సంఘం నేతలు డాక్టర్ సతీశ్, బూర మల్లేశం, చిప్ప ప్రభాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.