సిద్దిపేట,ఆగస్టు 28: “పేదలకు ఆసరా పింఛన్లు ఇచ్చి ఆత్మ గౌరవం పెంచిన పేదింటి పెద్ద కొడుకు సీఎం కేసీఆర్” అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌తో కలిసి సిద్దిపేట పట్టణంలో లబ్ధిదారులకు నూతన పింఛన్ కార్డులు అందజేశారు. ఈసందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు.
టీడీపీ హయాంలో రూ.50 ఉన్న పింఛన్ నేడు రూ.2016కి పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదన్నారు. పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ను మోదీ బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. సిద్దిపేటలో ఒకప్పుడు 8000 వేలు ఉన్న పింఛన్లు నేడు 18వేల మందికి ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నదన్నారు.
57ఏండ్లు నిండిన వారికి పింఛన్ ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం నేడు వారికి నూతన పింఛన్లు ఇచ్చామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా నిరుపేదలు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2016 పింఛన్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. మేము అధికారంలోకి వస్తే గ్యాస్ రేట్లు తగ్గిస్తామని చెప్పి నేడు ఉన్న సబ్సిడీని ఎత్తి వేసింది బీజేపీ కాదా అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో బీజేపీ నేతలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
దేశంలో అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న పీఎం నరేంద్ర మోదీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. బీజేపీ నాయకుడు నడ్డా వరంగల్‌కు వచ్చి అబద్ధాలు చెప్పి విమర్శలు చేయడం తప్ప తెలంగాణకు చేసిందేమీలేదన్నారు. నల్లగొండ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన సేవలు అందించడం లేదని నడ్డా అబద్ధాలు మాట్లాడారని, నేడు సూర్యాపేట, నల్లగొండలో మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ దవాఖానల ద్వారా పేదలకు వైద్య సేవలు, వైద్య విద్యార్థులకు విద్య అందిస్తున్నామన్నారు.
వరంగల్‌లో దవాఖాన కట్టడం లేదని నడ్డా మాట్లాడారు కానీ, మూడు నెలల్లో 15 శాతం పనులు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఎయిమ్స్‌లో తట్టెడు మట్టి కూడా తీయనిది కేంద్ర ప్రభుత్వమన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తనతో వస్తే వరంగల్ దవాఖాన పనులు చూపిస్తానన్నారు. ఎమ్మె ల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్‌కు అండగా ఉండాలన్నారు.
సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల ప్రయోజనం కోసం కృషి చేస్తున్నారన్నారు.కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం 57 ఏండ్లు దాటిన వారందరికీ రూ.2000 పింఛన్ ఇస్తుందని, అర్హులైన వారు ఇంకా మిగిలి ఉంటే వారి జాబితా తయారు చేసి వార్డుల వారీగా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజులా రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగింటి కనకరాజు, నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరామ్, డీఆర్డీఏ పీడీ గోపాల్‌రావు, మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డి పాటు ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నాకు పింఛన్ వచ్చింది. మంత్రి హరీశ్‌రావు సారు పింఛన్‌కార్డు ఇచ్చారు. ప్రభుత్వం పింఛన్ ఇవ్వడం చాలా సంతోషకరం. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. పైసలు నేరుగా ప్రతి నెలా మా బ్యాంకు ఖాతాలో జమఅవుతాయని చెప్పిండ్రు. నాకు మందులకు అక్కరకు వస్తాయి. ఇప్పుడు ఎంతోధైర్యంగా ఉన్నది.
-వానరిసి చంద్రయ్య, ఎల్లమ్మగుడివీధి
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు రుణపడి ఉంటాం. 57 ఏండ్లు దాటిన వారికి పింఛన్ ఇస్తానని చెప్పిన మాట ప్రకారం నేడు పింఛన్లు అందించడం సంతోషంగా ఉన్నది. మాకు ఆసరాగా నిలిచిన ప్రభుత్వానికి అండగా ఉంటాం. పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
-సాయన్నగారి అనసూయ, 16వ వార్డు