మెదక్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలబడేందుకు ఆయుష్మాన్ భారత్-ఆరోగ్య శ్రీ పథకాలు వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సర్కార్, ప్రైవేటు దవాఖానల్లో ఆహార భద్రత కార్డుదారులు మెరుగైన వైద్య సేవలను ఉచితంగా పొందే అవకాశం కల్పించింది. మెదక్ జిల్లాలో రెండు లక్షల మందికి లబ్ధి చేకూరనున్నది. జిల్లా కేంద్ర దవాఖానతో పాటు అన్ని పీహెచ్‌సీల్లో ఆరోగ్య శ్రీ కింద 110 రకాల వ్యాధులకు ఫ్రీగా చికిత్స చేయనున్నారు.
ఆహార భద్రతా కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరోగ్యశ్రీ సేవలు పొందేందుకు ఇబ్బందులు పడుతున్న వారికి ఆయుష్మాన్ భారత్- ఆరోగ్యశ్రీ సేవలు వర్తింపజేస్తూ నిర్ణయించింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఉత్తర్వులు జారీచేసింది. తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. దీంతో మెదక్ జిల్లాలోని 2 లక్షల మంది ఆహార భద్రతా కార్డుదారులకు ప్రయోజనం చేకూరనున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 2 లక్షల మందికి ప్రయోజనం
75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆహార భద్రతా కార్డుతో ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ సేవలు పొందేందుకు అవకాశం కల్పించింది. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు పొందడంలో ఆహార భద్రతా కార్డుదారులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వాటిని తొలిగించాలని సంకల్పించింది. తాజా ఉత్తర్వులతో జిల్లాలో 2 లక్షల మంది కార్డుదారులకు ప్రయోజనం చేకూరనున్నది. ఇక నుంచి ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఆహార భద్రతా కార్డుదారులు ఇబ్బందులు పడకుండా వైద్య సేవలు పొందే వెసులుబాటు కలుగనున్నది. మెదక్‌లోని జిల్లా కేంద్ర దవాఖాన, నర్సాపూర్‌లో ఏరియా దవాఖాన, తూప్రాన్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నారు.
లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి
ఆహార భద్రతా కార్డుదారులకు ఆయుష్మాన్ భారత్- ఆరోగ్య శ్రీ సేవలను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య శ్రీలో 110 రకాల వ్యాధులకు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. జిల్లాలోని జిల్లా కేంద్ర దవాఖానతో పాటు అన్ని పీహెచ్‌సీల్లోనూ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఆహార భద్రతా కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్‌వో మెదక్