సదాశివపేట, ఆగస్టు 26: చిన్నారుల భవితకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ధారాళంగా చదవడం, తప్పుల్లేకుండా రాయడం, గణితంలో కనీస విద్యా ప్రమాణాలు పెంచడం వంటివి చేయనున్నది. కరోనా కారణంగా ప్రత్యక్ష చదువుకు దూరమైన పిల్లలు తెలుగు, ఆంగ్లం, గణితంలో వెనుకబడ్డారని గుర్తించి, తొలిమెట్టు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. ఈ నెల 15 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏడాది పాటు కొనసాగనున్నది.
ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ
తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియాల్లోని 8 మంది సెకండరీ గ్రేడ్ టీచర్స్ రిసోర్స్పర్సన్లుగా రాష్ట్ర స్థాయిలో శిక్షణ తీసుకున్నారు. ఐదుగురు కో ఆర్డినేటర్లు శిక్షణ పొందారు. జిల్లా స్థాయిలో మండలానికి నలుగురు రిసోర్స్ పర్సన్లకు మూడు రోజులు శిక్షణ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలోని 860 ప్రాథమిక, 191 ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 2635 ఎస్జీటీలకు మూడు విడతల్లో మండల స్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఇందులో ఎస్జీటీలు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలకు శిక్షణ అందించారు. ఈ నెల 15 నుంచి అన్ని పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలుచేశారు. ప్పటికే విద్యార్థులకు వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమ విశిష్టతను తెలియజేశారు.
1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు..
తొలిమెట్టు కార్యక్రమానికి దీనిని తగిన ప్రణాళికలు విద్యాశాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వారంలో ఐదు రోజుల పాటు పాఠాలు బోధించి, ఒక రోజు పరీక్ష నిర్వహిస్తున్నారు. ఎస్ఎంసీ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలను కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నారు. పాఠశాల స్థాయిలో హెచ్ఎం, సముదాయాల పరిధిలో కాంప్లెక్స్ హెచ్ఎం, మండల స్థాయిలో ఎంఈవోలు నోడల్ అధికారులుగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. డీఈవో, సెక్టోరల్ అధికారులు, ఎస్సీఈఆర్టీ అధికారులతో మానిటరింగ్ బృందాలు పర్యవేక్షిస్తున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో…
జిల్లాలో తొలిమెట్టు కార్యక్రమం అమలుకు ప్రత్యేకంగా నలుగురు రిసోర్స్ పర్సన్లు రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందారు. వీరు జిల్లాలో ఎంపిక చేసిన 120 మంది రిసోర్స్ పర్సన్లకు, 2635 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఈ నెల 12 వరకు ఈ శిక్షణ పూర్తయింది. ఈ నెల 15 నుంచి పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఏడాది పాటు తొలిమెట్టు కార్యక్రమం అమలుకానున్నది. జిల్లాలో 1 నుంచి ఐదో తరగతి చదువుతున్న 68,116 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనున్నది.
సామర్థ్యం పెంచేందుకు..
విద్యా ప్రమాణాల పెంపు, గుణాత్మకమైన మార్పుతో కనీస సామర్థ్యం సాధించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఏడాది పాటు కార్యక్రమం కొనసాగనున్నది. ఒకటో తరగతి విద్యార్థులు 20 పదాలు, రెండో తరగతిలో 25 పదాలు, మూడో తరగతిలో 30 పదాలు, నాల్గో తరగతిలో 40 పదాలు, ఐదో తరగతిలో 50 పదాలు ధారాళంగా చదువగల్గాలి. 3, 4, 5 తరగతి విద్యార్థులు ఇచ్చిన పేరాను చదివి అర్థం చేసుకోవాలి. నాలుగు నుంచి ఐదు వ్యాక్యాలతో కూడిన పేరాలు రాయగలగాలి. అప్పుడే విద్యార్థుల్లో సామర్థ్యం పెరిగినట్లు లెక్క.
భవిష్యత్తుకు పునాది…
తొలిమెట్టు కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్తుకు పునాదిలాంటిది. విద్యార్థుల సామర్థ్యం పెరుగుతుంది. చదవడం, రాయడం, ఒత్తులు, గుణింతాలు లాంటివి వస్తే ఉన్నత తరగతుల్లో విద్యార్థి మంచి ఫలితాలు సాధిస్తాడు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో సామర్థ్యం పెంచేందుకు కృషి చేస్తున్నారు.
– అంజయ్య, ఎంఈవో, సదాశివపేట