అందోల్, ఆగస్టు 26: జోగిపేట దవాఖానలో మరో సౌకర్యం అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే వంద పడకలతో రోగులకు మెరుగైన వైద్యం అందుతుండగా, తాజాగా డయాలసిస్ కేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఇన్నాళ్లూ కిడ్నీ వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి వేలకు వేలు ఖర్చుచేసిన ఆర్థికంగా ఇబ్బందులు పడిన స్థానికులకు ఇకపై అవస్థలు తప్పనున్నాయి. ఏరియా దవాఖానలోనే ఉచితంగా సేవలు అందనుండడంతో రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డయాలసిస్ యూనిట్‌ను కేటాయించినందుకు శుక్రవారం ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
నియోజకవర్గ కేంద్రమైన జోగిపేట పట్టణంలోని ప్రభుత్వ దవాఖానకు ప్రభుత్వం శుక్రవారం నూతనంగా డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేసింది. జోగిపేటకు డయాలసిస్ కేంద్రం మంజూరు చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ గతంలోనే ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు విన్నవించారు. దీంతో శుక్రవారం డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జోగిపేటలో వంద పడకల దవాఖానలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతుండగా, ప్రస్తుతం డయాలసిస్ కేంద్రం సైతం ఏర్పాటు కానున్నది.
మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు
– ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
జోగిపేట ఏరియా దవాఖానకు డయాలసిస్ కేంద్రం మంజూరు చేయడంపై ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హర్షం వ్యక్తంచేస్తూ, నియోజకవర్గం ప్రజల పక్షాన మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసిన ఎమ్మెల్యే డయాలసిస్ కేంద్రం మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.