నర్సాపూర్, ఆగస్టు 26 : మున్సిపాలిటీలోని ప్రజలను కోతుల బెడద నుంచి విముక్తి కలిగిస్తామని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. శుక్రవారం నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మురళీయాదవ్ అధ్యక్షతన కౌ న్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి అదనపు కలెక్టర్ హాజరై పలు తీర్మానాలను పరిశీలించారు. సమావేశం మొదలు కాగానే మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి తీర్మానాలను వివరిస్తుండగా మొదటగా కోతుల సమస్య గురించి చర్చించాలని కౌన్సిలర్లు పట్టుపట్టారు. దీంతో అదనపు కలెక్టర్ స్థానిక ఎఫ్ఆర్వోను సమావేశానికి పిలిపించి, కోతులను తరలించే చర్యలను వివరించాలని కోరారు.
దీంతో చేపట్ట నున్న చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ కోతులను చం పడానికి చట్టం ఒప్పుకోదని, వాటిని వేరే ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటవీశాఖ నుంచి అనుమతులు తీసుకొని కోతులను పట్టేవారిని రప్పిం చి, కోతులను తరలిస్తామన్నారు. అనుమతులకు కావాల్సిన ప్రక్రియను తక్షణమే చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అనంతరం కోతుల దాడిలో మృతి చెందిన మణికంఠ అనే బాలుడికి మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘ టించారు. సమావేశంలో ఆర్డీవో వెంకటఉపేందర్రెడ్డి, ము న్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, ఎఫ్ఆర్వో అంబర్‌సింగ్, ఎస్సై గంగరాజు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.