దుబ్బాక, ఆగస్టు 25 : దళితబంధు పథకం ఆ కుటుంబంలో వెలుగు నింపింది. నాడు ఉపాధి కోసం పట్నం వెళ్లిన అతనికి ఉన్న ఊరిలోనే ఉపాధి కల్పించింది. ఉన్న ఊరిలోనే సమోసాలు తయారు చేస్తూ, మరో నలుగురికి ఉపాధి చూపుతూ సగౌరవంగా బతుకుతున్నారు. వివరాల్లోకి వెళితే.. దుబ్బాక మండలం ఆరెపల్లెకి చెందిన సోమారపు కిషన్ రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. కిషన్ ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లి, అక్కడ హోటల్లో కూలీ పనులు చేసుకుంటూ.. కుటుంబాన్ని పోషించుకునేవాడు. తనతో పాటు ఇద్దరి తమ్ముళ్లను సైతం పట్నం తీసుకెళ్లాడు. అక్కడ సమోసాలు తయారీ చేసేవారు.
అప్పటివరకు కూలీ పనులు చేస్తూ.. కుటుంబాలను పోషించుకున్నారు. సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టడం.. ఆరెపల్లె గ్రామాన్ని దళితబంధు పథకంలో ఎంపికచేయడంతో గ్రామంలోని దళితుల కుటుంబాలకు ఒక్కసారిగా మారిపోయాయి. పట్నంలోని ఓ హోటల్లో సమోసాలు చేస్తూ.. కూలీగా ఉన్న సోమరపు కిషన్ నేడు యజమానిగా మారిపోయి, ఆర్థికంగా బలోపేతం కావడమే గాక మరో పదిమందికి ఉపాధి కల్పించి సమాజంలో గౌరవంగా జీవిస్తున్నాడు.
సీఎం కేసీర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో రూ.10 లక్షలతో కిషన్ గ్రామంలో తన ఇంటి ఆవరణలో ఓ షెడ్డు ఏర్పాటు చేసి, తాను పట్నంలో నేర్చుకున్న సమోసా తయారీ కంపెనీ ఏర్పాటు చేశాడు. సమోస తయారీతో పాటు మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాడు. మొదట తన కుటుంబీకులతో కలిసి సమోసాలు తయారీ చేశారు. ఆర్డర్లు పెరుగటంతో మరో పది మందికి ఉపాధి కల్పిస్తూ.. సమోసాలను జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాలకు కామారెడ్డి, రాజన్న సిరిసిల్లకు సప్లయ్ చేస్తున్నాడు. కిషన్‌తో పాటు ఆయన సోదరుడికి దళితబంధు పథకంలో గూడ్స్ వాహనం తీసుకున్నాడు.
దీంతో సమోసాలకు కావాల్సిన ముడి పదార్థాలు తీసుకురావటం, తయారీ చేసిన సమోసాలను సప్లయ్ చేస్తూ ఆర్థికంగా బలోపేతమయ్యారు. హోల్‌సేల్‌గా సమోసాలు విక్రయించటంతో పాటు దుబ్బాక, ముస్తాబాద్, సిద్దిపేట సెంటర్లలో రిటైల్‌గా బండ్లపై సమోసాలు చేస్తూ మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. నాడు కూలీగా ఉన్న కిషన్ దళితబంధు పథకం తనను యజమానిగా చేయటమేగాక ఆర్థిక ఇబ్బందులు తొలిగించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
సీఎం కేసీఆర్ మా పాలిట దేవుడు. గతంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశాం. పేదోళ్ల కోసం ఆలోచించి, దళితులను లక్షాధికారులను చేసిన సీఎం కేసీఆర్ మనకు దొరకటం అదృష్టంగా భావిస్తున్నాం. కూలీగా ఉన్న నేను, ఇప్పుడు యజమానిగా మారా. సీమాంధ్ర ప్రభుత్వాల హయాంలో పని లేక, పట్నానికి వలస పోయిన. తెలంగాణ వచ్చినంక స్వగ్రామంలో తలెత్తుకొని బతుకుతున్న. కేసీఆర్ దళితబంధు పథకంలో నాకు రూ.10 లక్షలు ఇచ్చారు.
మొదట 60శాతం డబ్బులు ఇవ్వడంతో మా ఇంటి ఖాళీ స్థలంలో సమోసా తయారీ షెడ్ నిర్మించా. మేం తయారీ చేసే సమోసాకు మంచి డిమాండ్ రావడంతో ఆర్డర్లు పెరిగాయి. డజన్ సమోసాకు రూ.18 హోల్‌సేల్‌గా విక్రయిస్తాం. రిటైల్ వ్యాపారులు రూ.24 వరకు విక్రయిస్తారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక పట్టణాలకు సమోసాలు స్లపయ్ చేస్తున్నాం. పక్క జిల్లాలు రాజన్న సిరిసిల్ల, కామారెడ్డికి పంపుతున్నాం. దీంతో మా కుటుంబీకులతో పాటు మరో పది మందికి ఉపాధి కల్పిస్తున్నాం. దుబ్బాక, సిద్దిపేట, ముస్తాబాద్‌లో తోపుడు బండ్లపై కూలీలతో సమోసాలు విక్రయిస్తున్నాం. అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ.50 వేలకు పైగా సంపాదిస్తున్నాం.
– సోమారపు కిషన్, ఆరెపల్లె, దుబ్బాక