మిరుదొడ్డి, ఆగస్టు 25 : దేశంలోనే ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌తో పాటు పల్లెల్లో మతచిచ్చు రేపుతున్న ఎమ్మెల్యే రాజాసింగ్ శాసన సభ సభ్యత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పెద్దలింగన్న గారి శంకర్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని మైనార్టీ వర్గాలను రెచ్చ గొడుతూ హక్కులను కాల రాస్తున్న రాజాసింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, నాయకులు వినయ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్, ఆగస్టు 25 : గజ్వేల్‌లోని ప్రభుత్వ జిల్లా దవాఖానను గురువారం ఒడిశా రాష్ట్రంలోని వివిధ దవాఖానల్లో పనిచేస్తున్న అడ్మినిస్ట్రేషన్ అధికారులు సందర్శించారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో పేషంట్ సేఫ్టీ, అండ్ క్వాలిటీ నిర్వహణ శిక్షణలో భాగంగా అధికారులు గురువారం గజ్వేల్‌లోని ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. కళాశాల ప్రొఫెసర్ భావన నేతృత్వంలో 30 మంది ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ అధికారుల బృందం రెండుగా విడిపోయి దవాఖానలోని ప్రసూతి వార్డులు, గర్భిణుల పరీక్షలు, లేబర్‌రూం, అవుట్ పేషెంట్, డయాలసిస్ తదితర విభాగాలను పరిశీలించి నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
దవాఖాన సూపరిండెంటెండ్ డాక్టర్ సాయికిరణ్ క్వాలిటీ ఇన్చార్జి స్వామి, మరియమ్మ తదితరులు అధికారుల బృందానికి దవాఖాన నిర్వహణ వివరాలను వివరించారు. కాగా ఒడిశా అధికారులు ఆయా అంశాలను పరిశీలించడంతో పాటు సూచికల బోర్డులు, సేవల బోర్డులను ఫొటోలు తీసుకున్నారు. దవాఖానకు వచ్చిన రోగులను, సిబ్బందిని అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకొని వివరాలను నమోదు చేసుకున్నారు. ఒడిశా అధికారుల బృందం గజ్వేల్ దవాఖానను సందర్శించడం ఇది రెండోసారి. సేవలు భేష్ అని కితాబిచ్చారు. కాగా శుక్రవారం ఒడిశా అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అధికారుల బృందం కూడా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానను సందర్శించనున్నది.