చేర్యాల, ఆగస్టు 25 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయానికి సంబంధించిన టెండర్లకు సంబంధించిన డబ్బులు వసూలు చేయడంలో ఆలయవర్గాలు నిర్లక్ష్యం వహిస్తుండడంతో మల్లన్న ఖజానాకు ఏటా లక్షలాది రూపాయలు జమకాకుండా పోతున్నాయి. కొందరు టెండరుదారులు కోర్టులను ఆశ్రయించి, డబ్బులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారు.
గతేడాది కొబ్బరికాయల టెండరు డబ్బులు వసూలు చేయాల్సిన సంబంధిత సెక్షన్ ఇన్చార్జి నిర్లక్ష్యంతో స్వామి వారి ఖజానాకు రూ.16 లక్షలు రాకుండా పోగా, తాము ఇప్పుడు డబ్బులు చెల్లించలేమనే సాకుతో టెండరుదారుడు కోర్టును ఆశ్రయించడంతో, టెండరుదారుడు వేసిన కేసును ఎదుర్కొనేందుకు ఆలయవర్గాలు సైతం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా, ఆలయ టెండరు నిబంధనల మేరకు టెండరు సమయంలో ఎక్కువ పాట పాడి, టెండరు దక్కించుకున్న టెండరుదారుడు పాట ముగిసిన 3 రోజుల్లో మొత్తం పాట సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
లేని పక్షంలో టెండరు రద్దు చేసి, చెల్లించిన సొమ్మును జప్తు చేసి, తిరిగి వేలం నిర్వహించాలనే నిబంధనలున్నాయి. ఈ సమయంలో టెండరుదారుడు ఎలాంటి ఆక్షేపణలు చెల్లవని దేవాదాయశాఖ టెండరు నిబంధనల్లో ఉన్నాయి. సదరు నిబంధనల మేరకు వ్యక్తి లేదా సంస్థ ఆలయానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ మల్లన్న ఆలయంలో డబ్బులు వసూలు చేయాల్సిన ఇన్చార్జిల నిర్లక్ష్యంతో లక్షలాది రూపాయల సొమ్ము స్వామి వారి ఖజానాకు జమ కావడం లేదు.
మల్లన్న ఆలయంలో కొబ్బరిముక్కలు సేకరణ, స్వామి వారి వస్ర్తాల సేకరణ, సెల్ ఫోన్ల భద్రపరిచే హక్కులు, ఒడిబియ్యం సేకరణ, కొబ్బరికాయల విక్రయ హక్కులు, తలనీలాల సేకరణ, ఎల్లమ్మ ఆలయం వద్ద కొబ్బరికాయల విక్రయ హక్కు లు, టాయిలెట్స్ నిర్వహణ టెండర్లు, చెప్పుల స్టాండ్ నిర్వహణ టెండర్ల ఇటీవల టెండర్లు నిర్వహించారు.
కోరమీసాల విక్రయ హక్కులకు సరైన పాట రాకపోవడంతో దానిని త్వరలో ఖరారు చేయనున్నారు. కాగా, టెండర్లలో కొబ్బరికాయల విక్రయం, చెప్పుల స్టాండ్ నిర్వహణ, ఒడి బియ్యం టెండరుదారులు మాత్రమే టెండర్ నిబంధనల మేరకు డబ్బులు చెల్లించారు. టెండర్ల సమయంలో నిబంధనల మేరకు డబ్బులు చెల్లించాలని అధికారులు గట్టిగా చెప్పడంతో కొందరు వేలం పాటల్లో పాల్గొనకుండా వెనక్కితగ్గారు. టెండర్లు ముగిసి రెండు నెలలైనా టెండరుదారులు డబ్బులు చెల్లించకపోయిన అధికారులు సైలెంట్‌గా ఉన్నారు.
కొబ్బరి ముక్కల సేకరణ హక్కులకు సంబంధించిన టెండరు రూ.27,01,116 కాగా, అందులో రూ.18లక్షలు చెల్లించగా, మరో రూ.9,01,116 బకాయి ఉంది. వస్ర్తాల సేకరణ హక్కులకు రూ.18.01లక్షలు కాగా, అందులో రూ.10,80, 600 చెల్లించగా, రూ.7,20,400 బకాయి ఉంది. సెల్ఫోన్ల టెండరు రూ.11,26,001కు రూ.6,76,00 చెల్లించగా, మరో రూ.4,50,001 పెండింగ్‌లో ఉంది. తలనీలాల సేకరణ టెండరు రూ.84.47లక్షలకు రూ.61లక్షలు చెల్లించగా, రూ.23 లక్షల 47వేలు బకాయి ఉంది.
ఎల్లమ్మ ఆలయం వద్ద కొబ్బరికాయల విక్రయ టెండరు రూ.8.53 లక్షలకు రూ.7 లక్షలు చెల్లించగా, మరో రూ. లక్ష 53వేలు బకాయి ఉంది. టాయిలెట్స్ నిర్వహణ టెండరు రూ.2.75లక్షలకు రూ.2లక్షలు చెల్లించగా, మరో రూ.75వేలు పెండింగ్‌లో ఉంది. అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిం చి డబ్బులు వసూలు చేయాలని అవసరం ఉందని మల్లన్న భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.