సిద్దిపేట అర్బన్, ఆగస్టు 25 : బాధితులకు భరోసా కల్పించడంతో పాటు వారికి పూర్తి సహాయ సహకారాలను సిద్దిపేట భరోసా కేంద్రం కల్పిస్తున్నదని సిద్దిపేట పోలీస్ కమీషనర్ ఎన్.శ్వేత తెలిపారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్లో మహిళలు, బాలల రక్షణ కోసం సత్వర సేవలు అందించేందుకు తీసుకుంటున్న చర్యలపై సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. భరోసా సెంటర్ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసిన కేసుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ భరోసా సెంటర్ ద్వారా సత్వర సేవలు అందిస్తున్నామని, జిల్లాలో ఎక్కడైనా పోక్సో, లైంగిక దాడి కేసులు జరగగానే సంబంధిత బాధితులు నేరుగా భరోసా సెంటర్‌కు రాగానే సూచనలు, సలహాలు అధికారులు తక్షణమే అందించాలని సూచించారు. సంబంధిత బాధితులకు ఎవరూ లేనపుడు సిద్దిపేట బాలసదన్‌లో ఆశ్రమం కల్పించాలన్నారు.
సంబంధిత భాదితులు డయల్ 100, సిద్దిపేట జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8333998699 నెంబర్‌కు ఫోన్ చేసి సహాయ సహకారాలు పొందవచ్చని సూచించారు. భరోసా కేంద్రంలో 39 పోక్సో కేసులు, 3 మిస్సింగ్ కేసులు, 11 లైంగికదాడి కేసుల్లో బాధితుల భరోసా కల్పించామన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, మహిళా ఇన్స్పెక్టర్ దుర్గా, ఎస్సై స్రవంతి, భరోసా సెంటర్ సిబ్బంది భవాని, రేణుక, సౌమ్య, సోని, హరిత పాల్గొన్నారు.