మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 26: ఇక పట్టణాల్లో డిజిటల్ ఇంటి నంబర్లు రానున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఇండ్లకు డిజిటల్ నంబర్లు ఏర్పాటు చేయనున్నట్లు మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకుగాను అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణను దృష్టిలో పెట్టుకుని పరిపాలనా సేవల్లో పారదర్శకతకు ఉపయుక్తంగా ఉండనున్నది.
మౌలిక వసతుల కల్పనకు ఇంటి డిజిటల్ సంఖ్య ఆలంబనగా నిలువనున్నది. పట్టణ ప్రగతితో పాటు పాలనాపరంగా అమలు చేస్తున్న నూతన విధానాల అమలుకు ఇది చేయూతనివ్వనున్నది. ఇప్పటికే మున్సిపాలిటీల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాయి. వీటికి సంబంధించిన క్యూఆర్ కోడ్లతో కూడిన చార్టులు మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఆస్తి పన్ను వివరాలు, చెల్లింపులు, ఆస్తి పన్ను స్వీయ మదింపు, వ్యాపార అనుమతి- పునరుద్ధరణ, ప్రకటనల కోసం లైసెన్స్‌లు, భవనాలు, లేఅవుట్ల అనుమతి, నల్లా కనెక్షన్లు పొందడం, ఫిర్యాదుల పరిష్కారం, మొబైల్ టవర్ అనుమతి, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు తదితర సేలను ఆన్లైన్లో పొందే వీలు ఉంటుంది.
మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఇండ్లకు ప్రయోజనం చేకూరనున్నది. ఆంగ్ల అక్షరాలతో పాటు నంబర్లతో కూడిన సంఖ్యను సులభంగా గుర్తించేలా ఈ డిజిటల్ ప్లేట్ ఉండనున్నది. వార్డుల్లోని ఇండ్ల నంబర్లన్నీ ఒకే క్రమ సంఖ్య, పక్క కాలనీకి వరుస క్రమంలో ప్రారంభమయ్యేలా మార్పు చేస్తారు. ఇందుకు రెవెన్యూ పరిధి ప్రాతిపదికగా ఉంటుంది.
పిన్ కోడ్ మాదిరిగానే రాష్ట్రం, జిల్లా, మున్సిపల్, వార్డులు ఇలా కోడ్ల వారీగా సంఖ్యను ఇంటికి కేటాయిస్తారు. అపార్ట్మెంట్లకు ఒకే సంఖ్య ఇచ్చి చివరలో ఇంటి ప్లాట్ నంబర్ జోడిస్తారు. ప్రాంతం పేరు, కాలానీ రోడ్ల నంబర్లు, అంతస్తు వివరాలు పక్కగా నమోదు చేస్తారు. డిజిటల్ నంబర్‌ను ఇంటర్నెట్లో అనుసంధానం చేస్తే భవిష్యత్తులో సులభంగా గూగుల్ మ్యాప్ ద్వారా దారి చూపిస్తుంది. ఈ సంఖ్యతో పాటు బార్ కోడ్‌ని స్కాన్ చేస్తే సిబ్బందికి దీని ద్వారా చెల్లింపులు, బకాయిలు, ఇంటి సమగ్ర సమాచారం ప్రత్యక్షమవుతాయి.
ఇంటికి డిజిటల్ సంఖ్య కేటాయింపుతో మున్సిపాలిటీల్లో గందరగోళానికి అవకాశం ఉండదు. బై నంబర్లు ఉండవు. కోడ్ల ప్రామాణికంగా నూతన డిజిటల్ ఇంటి నంబర్లకు రూపకల్పన జరుగుతుంది. అన్నింటా డిజిటలైజేషన్ విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగానే పాత ఇండ్ల నంబర్లకు స్వస్తి పలికి కొత్త నంబర్లతో సరికొత్త విధానం ఆచరణలోకి రావడానికి కొంత సమయం పడనున్నది. దీని అమలుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ త్వరలో ఇవ్వనున్నారు.
జిల్లాలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్‌లో 11,500 నివాసాలు, నర్సాపూర్‌లో 4,200, తూప్రాన్‌లో 6,009, రామాయంపేటలో 5,100 నివాసాలున్నాయి.