సంగారెడ్డి, ఆగస్టు 19: క్షణికావేశంతో నేరం చేసి ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న వారిలో మార్పురావాలని కలెక్టర్ శరత్ కుమార్ నాయక్ సూచించారు. శుక్రవారం కంది మండల కేంద్రంలోని జిల్లా జైలును సందర్శించి స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని 450 మంది ఖైదీలకు జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎస్పీ రమణకుమార్తో కలిసి కలెక్టర్ పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. అంతకుముందు సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులోని అనాథాశ్రమాలు, రెండు వృద్ధాశ్రమాల్లో వృద్ధులు, చిన్నారులకు మిఠాయిలు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుని ప్రజలు దేశభక్తిని చాటి చెప్పడం సంతోషకరమన్నారు. అనంతరం జైలులో ఖైదీలతో మాట్లాడుతూ సత్ప్రవర్థన కలిగి ఉంటేనే త్వరగా విడుదలయ్యే అవకాశం ఉంటుందని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, ఎంపీపీ సరళాపుల్లారెడ్డి, సర్పంచ్ విమలావీరేశం, అదనపు కలెక్టర్ రాజర్షి షా, ఐసీడీఎస్ పీడీ పద్మావతి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆర్డీవో మెంచు నగేశ్, సీడీపీవో రేణుక, డీసీపీవో రత్నం, సిబ్బంది లింగం, రామకృష్ణ, మొగులయ్య, జైలు అధికారులు, సిబ్బంది, ఖైదీలు తదితరులు పాల్గొన్నారు.