మెదక్ రూరల్, ఆగస్టు 18: జై జనార్ధనా కృష్ణ రాధికా పతే.. జన విమోచనా కృష్ణ జన్మ మోచనా.. గరుడ వాహనా కృష్ణ గోపికా పతే.. అంటూ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడి జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడు పుట్టిన రోజును కృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని రకారకాల పేర్లతో పిలుస్తారు. దేవకీ వసుదేవుల ఎనిమిదో సంతానం శ్రీకృష్ణుడు. శ్రావణమాసం ఎనిమిదో కృష్ణ పక్షం అష్టమి రోజున కంసుడి చెరసాలలో శ్రీకృష్ణుడు జన్మించాడు.
పండుగను ఇలా జరుపుకోవాలి
భూభారాన్ని తగ్గించడానికి శ్రావణ బహుళ అష్టమి నాటి అర్ధరాత్రి శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించాడు. కృష్ణుడు తన దివ్య ప్రేమతో అందరినీ ఉద్దరించిన అమృతమూర్తి. ఆ బాలగోపాలం ఆయన పుట్టిన రోజునే జన్మాష్టమిగా జరుపుకొంటారు. ఈ రోజు ఉదయాన్నే లేచి పరిశుద్ధులై, షోడశోపచారులతో కృష్ణుడిని పూజించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం చిన్నికృష్ణుడి విగ్రహాన్ని ఊరేగించి, తర్వాత ఊయలలో ఉంచి, ఊపాలి. అనంతరం కృష్ణుడికి ప్రీతికరమైన పాలు, వెన్న, పండ్లు, అటుకులు నైవేద్యంగా పెట్టాలి. దేవకీదేవి బాలకృష్ణుడికి స్తన్యమిస్తున్నట్లుగా ఉండే విగ్రహాన్ని పూజించినా మంచిదే. ఈ పుణ్య తిథి నాడు కృష్ణుణి పూజించి, భాగవతాన్ని పఠించినా, దానం చేసినా సకల పాపాలు తొలిగి, చతుర్విద ఫల పురుషార్థాలు ప్రాప్తిస్తాయని స్కాంద పురాణం చెబుతున్నది.
కృష్ణ జన్మాష్టమి శుభ సమయం
18 ఆగస్టు గురువారం రాత్రి 9:22 తర్వాత కృత్తిక నక్షత్రం మేషరాశిలో చంద్రుడు సంచరించుకున్నాడు. అష్టమి తిథి రాత్రి ఉన్న గురువారం రోజున శ్రీకృష్ట జన్మాష్టమి ఉపవాసం ఉండాలని వేద పండితులు సూచించారు. 18 నుంచి 19 రాత్రి 11 గంటల వరకు ఉంటుంది.
ముస్తాబైన ఆలయాలు
గోకులాష్టమి వేడుకలకు శ్రీకృష్ణ ఆలయాలు ముస్తాబయ్యాయి. యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఏటా గోకులాష్టమిని ఘనంగా నిర్వహిస్తారు. రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలో ఆలయాలను అందంగా తీర్చిదిద్దారు.
శ్రీకృష్ణుడికి పంచామృత స్నానం
శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో స్నానం చేయించాలి. విగ్రహానికి నగలతో అలంకరించాలి. అనంతరం స్వామి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. శ్రీకృష్ణుడిని తప్పనిసరిగా వేణువు, పూలమాలలు సమర్పించాలి. పండుగ రోజు గోవుకు సేవ
చేయడంతో కష్టాలు తొలిగిపోతాయి.
– వైద్య శ్రీనివాస్ శర్మ, పురోహితుడు, మెదక్
ఘనంగా గోకులాష్టమి వేడుకలు
యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టామి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. జిల్లాలోని ఆలయాలను అందంగా ముస్తాబుచేశాం. యాదవులు అత్యధికులుగా కలిగిన గ్రామాల్లో కృష్ణాష్టమికి ఒక రోజు ముందు నుంచే ఈ వేడుకల్లో నిమగ్నమవుతారు. అర్ధరాత్రి నుంచే వేడుకలను ప్రారంభిస్తాం. కృష్ణాష్టమి రోజున ఊయ్యాలో కృష్ణుడి ప్రతిమను ఉంచి కనుల పండువగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తాం. తమ చిన్నారులను కృష్ణుడు, గోపికల వేషధారణలో అందంగా అలంకరిస్తాం. అనంతరంశ్రీకృషుడి విగ్రహాన్ని ఊరేగిస్తాం. ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ముగింపు ఘట్టంగా నిర్వహించి, సహా పంక్తి భోజనాలతో వేడుకలు ముగిస్తాం.
– యాదగిరి యాదవ్, మెదక్ జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు