మెదక్ అర్బన్, ఆగస్టు18: క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడలతో శారీరక దారుఢ్యం, ఆర్యోగం లభిస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని కలెక్టరేట్లో ఉద్యోగులు, యువకులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి రోజు ఒక కార్యక్రమం నిర్వహించడంతో పది రోజులుగా గ్రామాలు కళకళలాడుతున్నాయన్నారు.
ఉద్యోగులు, యువకులను ఉత్సాహపరిచేందుకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గ్రామాల్లో క్రీడాస్ఫూర్తిని, ఆసక్తిని పెంపొందించేందుకు క్రీడ మైదానాలు ఏర్పాటు చేస్తున్నదన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో ట్రాక్ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడల్లో ఓడిపోయిన వారు బాధపడకుండా గెలుపు కోసం తపన పడాలన్నారు. ప్రతిఒక్కరూ ఎంతఎదిగినా ఒదిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఈవో రమేశ్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.