టేక్మాల్, ఆగస్టు17: ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. టేక్మాల్ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీచేశారు. పీఎస్‌లోని రికార్డులను ఆమె పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటి సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. స్టేషన్‌కు వచ్చే బాధితుల వినతులు, ఫిర్యాదులను విని వారితో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. పోలీస్‌సేష్టన్ పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరు ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని అడిగినా చెప్పొద్దని సూచించారు. ఏటీఎం కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు ఎవరికీ చెప్పొద్దని, ఎప్పటికప్పుడు వాటి పాస్వర్డ్లు మార్చాలని వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వకూడదని, ఒక వేళ ఇచ్చినా తరువాత వారికి ఎటువంటి ప్రమాదమైన సంభవిస్తే వాహన యజమానిదే బాధ్యత అని గుర్తుచేశారు.
మద్యం తాగి వాహనాలు నడపకూడదని, ప్రమాదం జరిగితే కలిగే నష్టం కన్నా జాగ్రత్తలే మేలని అన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో ముందస్తు నమాచారం ఇవ్వాలన్నారు. ఎవరైనా ఫోన్ చేసి మీకు లాటరీ వచ్చిందని, మాకు కొంత నగదు వేస్తే మీకు లక్షలు లేదా వాహనాలు ఇస్తామని చెబితే వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో అల్లాదుర్గ్ సీఐ జార్జ్, టేక్మాల్ ఎస్సై లింగం, సిబ్బంది ఉన్నారు.