నర్సాపూర్, ఆగస్ట్16 : అన్నను అతి కిరాతకంగా కత్తితో గొంతుకోసి తమ్ముడు చంపిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణానికి చెందిన చిత్తారి బుచ్చమ్మ, నర్సింలు దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు లక్ష్మణ్ అలియాజ్ ఓంకార్(38), చిన్న కొడుకు శేఖర్ ఉన్నారు. పెద్ద కుమారుడు లక్ష్మణ్ ఇంటి వద్దనే ఉంటున్నాడు. చిన్న కుమారుడు శేఖర్ పటాన్చెరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు నెలల కిందట లక్ష్మణ్ అతని భార్యతో గొడవ పడడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుండి మనస్తాపం చెందిన లక్ష్మణ్ మద్యానికి బానిసై తల్లిదండ్రులను తీవ్రంగా హింసిస్తున్నాడు. కొడుకు వేధింపులు తాళలేక తల్లిదండ్రులు సోమవారం చిన్న కుమారుడు శేఖర్‌ను పిలిపించి విషయం చెప్పారు. ఈ సమయంలో తమ్ముడి ఎదుటనే అన్న లక్ష్మణ్ తల్లిదండ్రులను కొట్టాడు. ఈ క్రమంలో ఇద్దరు అన్నదమ్ములు మంగళవారం ఇంట్లో మద్యం తాగా రు. ఆ సమయంలో మాటామాట పెరిగి తీవ్ర కోపోద్రిక్తులవడంతో శేఖర్ తన అన్న లక్ష్మణ్‌ని కూరగాయల కత్తితో అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.