మెదక్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ప్రజా సంక్షేమం లో భాగంగా విద్య, వైద్య రంగాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘మీ కోసం నేనున్నా’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే ఫోన్లో వివిధశాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా 42 మంది లబ్ధిదారులకు రూ.26, 54,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. మెదక్ పట్టణంలోని 150 పడకల ప్రభుత్వ దవాఖాన, డయాలసిస్ సెంటర్, డయాగ్నోస్టిక్ హబ్, రక్తనిధి కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే వివరించారు. వచ్చే ఏడాది జిల్లా కేంద్రం లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు
జిల్లా కేంద్రం మెదక్‌లోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించి రోగులతో మాట్లాడి వైద్య సేవలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాతా, శిశు సంరక్షణ కేంద్రం పేదలకు వరమని, ఈ కేంద్రం ద్వారా తల్లీపిల్లలకు ఆధునిక వైద్యం అందుతున్నదన్నారు. అనంతరం ఉత్తమ డాక్టర్‌గా ఎంపికైన డాక్టర్ అరుణానాయుడు, రాజ్యలక్ష్మికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ అంజాగౌడ్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డాక్టర్లు శివదయాల్, తిరుమలేశ్, టీఆర్ ఎస్ మండల అధ్యక్షులు గంగాధర్, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు జయరాజ్, శ్రీనివాస్, నేతలు అశోక్, లింగారెడ్డి, కృష్ణాగౌడ్, నగేశ్, మధు, మహ్మద్‌హుస్సేన్, బాలరాజ్, కిషన్, కిరణ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.