
తూప్రాన్/రామాయంపేట, జనవరి 28 : పందిరిసాగు విధానాన్ని ప్రతిఒక్క రైతు అలవర్చుకోవాలని ట్రైనీ కలెక్టర్ అశ్విని తానాజీ అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఆదర్శ గ్రామమైన మల్కాపూర్ గ్రామాన్ని ఉద్యావనశాఖ ఆధ్వర్యంలో సందర్శించి పండ్ల తోటల పెంపకాన్ని చేపడుతున్న రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు మల్కాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మల్కాపూర్ రైతులు పందిరి సాగు విధానంతో పంటలు పండించడం బాగుందన్నారు. కూరగాయల పంటలతో పాటు జామ, అరటి, డ్రాగన్ ఫ్రూట్ తదితర రకాల పంటలను సేంద్రియ ఎరువులతో పండించడం రైతుకు సిరులు కురిపిస్తుందన్నారు. డ్రిప్ విధానం, నీటి సంరక్షణను కూడా రైతులు అలవర్చుకోవడం మంచిదన్నారు. ఉద్యావన శాఖ అధికారులు రైతులకు పట్టుపరిశ్రమకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. పందిరిసాగుతో రైతులకు మంచి లాభాలుంటాయన్నారు. పంటల సాగులో జిల్లాలోనే మల్కాపూర్ రైతులు ఆదర్శంగా ఉన్నారని తెలిపారు. ట్రైనీ కలెక్టర్ వెంట ఏడీ.నర్సయ్య, రామకృష్ణ, మౌనికారెడ్డి, సర్పంచ్ మహాదేవి, ఉపసర్పంచ్ ఉన్నారు.