పెద్దశంకరంపేట, జూలై 22 : సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధాకారి వెంకటేశ్వర్ రావు అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట మండలం భూర్గుపల్లి గ్రామంలో నిర్వహించిన హెల్త్ క్యాంపును తనిఖీ చేశారు. వర్షాలు కురుస్తుండడంతో నీరు నిల్వ ఉంటుందని దాంట్లో దోమలు వృద్ధి చెందుతాయన్నారు. దోమ కాటుతో డెంగ్యూ, మలేరియా, మెదడు వాపు వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వివరించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలని సూచించారు. దోమలు కుట్టకుం డా జాగ్రత్త పడాలన్నారు. ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి, ప్రజలందరికీ వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారులు వినయ్‌కుమార్, సారిక, కార్తీక్, శ్రీనివాస్, సిబ్బంది భూమయ్య, వెంకటేశం, రామ్మోహన్ ఉన్నారు.
వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
చల్మెడ గ్రామంలో ఆరోగ్య సిబ్బం ది గ్రామస్తులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నవారికి మందులను పంపిణీ చేశారు. రజాక్‌పల్లిలో సర్పంచ్ సునీత ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు దోమ నివారణకు ఫాగింగ్ చేయిస్తున్నారు. కార్యక్రమం లో హెల్త్ సూపర్వైజర్ శ్యామల, ఏఎన్ఎంలు సుజాత, అనురాధ, సలోని, అంజలి, గ్రామస్తులు ఉన్నారు.
ఇంటి ముందు నీటి నిల్వలు ఉండొద్దు..
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే రోగాలు చేరవని సర్పంచ్ నర్సాగౌడ్ అన్నారు. రాయిలాపూర్ గ్రామంలో ఎంపీటీసీ భాగ్యమ్మ, వార్డు సభ్యు లు, ప్రభుత్వ వైద్యసిబ్బందితో కలిసి వీధుల్లో పర్యటించారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా పరిశుభ్రత పాటించాలని, నీటి నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు.
ఇంటిలోనే చెత్తను వేరు చేసి, ఇవ్వాలి..
మెదక్ మండల పరిధిలోని చిట్యాలలో వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరిసరాలను పరిశీ లించారు. ఇంట్లోనే చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి పం చాయతీ సిబ్బందికి అందించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశం, అంగన్వాడీ టీచర్ స్వప్న, ఆశ వర్కర్ నవనీత, కార్యదర్శి ప్రవీణ్ ఉన్నారు.
యశ్వంతరావుపేటలో ‘డ్రై-డే’ పనులు
వ్యాధులు ధరి చేరకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల పంచాయతీ అధికారి విఘ్నేశ్వర్ అన్నారు. యశ్వంతరావుపేటలో డ్రై డే పను లు చేపట్టారు. ఇందులో భాగంగా వీధుల్లో తిరుగుతూ పరిసరాల శుభ్రత, నీటి నిల్వల తొలిగింపుపై అవగాహన కల్పించారు. నీటిని నిల్వలతో వ్యాధులు సోకే ప్రమాదం ఉందని, తాగునీటిని వేడి చేసుకొని చల్లార్చి తాగాలని సూచించారు. వీరివెంట పంచాయతీ కార్యదర్శి నవీన్, ఆశవర్కర్లు ఉన్నారు.
మురుగునీటి కాలువలను శుభ్రం చేయించాలి
గ్రామాల్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు సూచించారు. చిల్వెర గ్రామంలో వైద్యాధికారి దివ్యజ్యోతి, సిబ్బంది కిష్టయ్యతో కలిసి పర్యటించారు.
డ్రై డే పనులను పరిశీలించిన ప్రత్యేకాధికారి
నిల్వ నీటితో వ్యాధులు వస్తాయని మండల ప్రత్యేకాధికారి జయరాజ్ అన్నారు. చేగుంట, చెట్లతిమ్మాయిపల్లి, నడిమితండా, మక్కరాజిపేట గ్రామాల్లో మం డల ప్రత్యేకాధికారి పర్యటించారు. ఆయన వెంట సర్పంచ్ మోహన్‌రాథోడ్, స్వాతీశ్రీనివాస్, ఉప సర్పంచ్ ముఖేష్‌గౌడ్, ఈవో రాణి, కార్యదర్శులు ఎల్లం, రమేశ్ ఉన్నారు.