మెదక్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో పంచాయతీరాజ్ శాఖకు చెందిన పలు రోడ్లు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. కొన్నేండ్లుగా దెబ్బతిన రోడ్లకు మరమ్మతులు జరగనున్నాయి. మెదక్ జిల్లాలో 85 వరకు ఉన్నట్లు గుర్తించారు. సీఎం ప్రత్యేక నిధుల కింద రూ.85 కోట్లు మం జూరయ్యాయి.
మెదక్ జిల్లాకు రూ.85 కోట్లు మంజూరు..
మెదక్ జిల్లాలో రోడ్ల మరమ్మతులకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద రూ.85 కోట్లు మం జూరయ్యాయి. ఇందులో 85 పనులు చేయనున్నారు. మెదక్ నియోజకవర్గంలో 29 పనులకు రూ. 24.98 కోట్లు మంజూరు కాగా, నర్సాపూర్ నియోజకవర్గంలో 18రోడ్ల మరమ్మతు పనులకు రూ.31.33 కోట్లు, అందోల్ నియోజకవర్గంలోని మెదక్ జిల్లాలోని మండలాల్లో 22 పనులకు రూ.17.13 కో ట్లు, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్దశంకరంపేట మండలంలో 6 పనులకు రూ. 2.69 కోట్లు, గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో 2 పనులకు రూ. 2.44 కోట్లు, దు బ్బాక నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగి మండలాల్లో 8 పనులకు రూ.5.63 కోట్లు మంజూరయ్యాయి.
ఇకపై ఇబ్బందులకు చెల్లు..
గుంతలమయంగా మారిన రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ ఆధీనంలోని ప్రధాన రోడ్ల పనుల మరమ్మతులకు మార్గం సుగమం కావడంతో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతోంది. జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాలతో పాటు పట్టణాల్లో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో కొన్ని చోట్ల ప్యాచ్ వర్కులు చేసి గోతులు పూడుస్తారు. మరికొన్ని చోట్ల రోడ్లపైన కొత్తగా పై లేయర్ వేస్తారు. దీంతో ఇన్నాండ్లు గుంతలతో ఉన్న రోడ్లు కొత్తగా దర్శనమివ్వనున్నాయి. రోడ్లకు మరమ్మతులు పూర్తయితే వాహనదారులు రయ్ అంటూ దూసుకుపోయే వీలుంది.
సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
మెదక్ జిల్లాలో రోడ్ల మరమ్మతులకు రూ. 85 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామాల్లో రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. గుంతలమయంగా మారిన రోడ్లకు సీఎం ప్రత్యేక నిధుల నుంచి నిధులు మంజూరు చేశారు. గతంలో గ్రామాలకు వెళ్లాలంటేనే వాహనదారులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు రహదారుల నిర్మాణంతో ప్రయాణం సాఫీగా సాగుతోంది. జిల్లాలో రోడ్ల మరమ్మతులకు ప్రత్యేక నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
-పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మెదక్