దుబ్బాక, జూలై 19 : నిజామాబాద్ నుంచి మెదక్, దుబ్బాక నియోజకవర్గం మీదుగా తిరుపతికి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలుకు మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారంలో రిక్వెస్ట్ స్టాప్‌ను ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ను మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి విన్నవించారు. మంగళవారం న్యూఢిల్లీలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ను మెదక్ ఎంపీ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. వడియారం నుంచి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలుకు స్టాప్ లేకపోవడంతో మెదక్ ఉమ్మడి జిల్లాల ప్రయాణుకులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ ప్రాంతం నుంచి నిత్యం చాలా మంది భక్తులు తిరుపతికి వెళ్తుంటారని, ఇక్కడి నుంచి రైలు వెళ్తున్నప్పటికీ, స్టాప్ లేకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తుందన్నారు. భక్తుల సౌకర్యార్థం వడియారం రైల్వే స్టేషన్లో రైలు నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. అదేవిధంగా టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.