మెదక్ మున్సిపాలిటీ, జూలై 19 : మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ తీపి కబురు అందించింది. బకాయిదారులకు 90 శాతం వడ్డీ మాఫీ చేస్తూ ఓటీఎస్ (వన్ టైం సెటిల్మెంట్ స్కీం) కింద 10 శాతం వడ్డీతో బకాయిలు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు ఆస్తిపన్ను చెల్లించాలని సూచించింది. ఏప్రిల్ 1 నుంచి జూలై 16 మధ్య పన్నులు చెల్లించిన వారికి సైతం సర్దుబాటు చేయనున్నారు. ఇంటి యజమానులు చెల్లించిన వడ్డీలో 90 శాతాన్ని వెనక్కి ఇచ్చేలా మున్సిపల్ శాఖ నిర్దేశించింది. కొవిడ్ సమయంలోనూ ఓటీఎస్ పథకం అమలు చేయగా విశేష స్పందన లభించింది. రెండేండ్ల తర్వాత మళ్లీ మున్సిపల్ శాఖ అవకాశం కల్పించింది. ఈ విషయమై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లకు మున్సిపల్ శాఖ ఆదేశించింది. వీలైనంత బకాయిలు రాబట్టేలా బల్దీయా అధికారులు సిద్ధమవుతున్నారు. మెదక్ మున్సిపాలిటీలో రూ.4 కోట్ల 3 లక్షల 93 వేలు డిమాండ్ ఉండగా, వడ్డీ మాఫీతో రూ.74లక్షల 14 వేలు రావల్సి ఉంది.
వడ్డీ మాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
బకాయిదారులకు ప్రభుత్వం కల్పించిన 90 శాతం వడ్డీ మాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అక్టోబర్ నెలాఖరు వరకు అవకాశం కల్పించింది. ఇందుకుగాను మున్సిపాలిటీలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. సాధ్యమైన వరకు బకాయిలు రాబట్టుతాం.
-శ్రీహరి, మున్సిపల్ కమిషనర్